రుద్రంపూర్, ఫిబ్రవరి 05 : చేవెళ్లకు చెందిన యువ మహిళా న్యాయవాది కుమారి స్వప్న హత్యను తీవ్రంగా ఖండిస్తూ గురువారం ఉదయం కొత్తగూడెం జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు ఆందోళన నిర్వహించారు. కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి, జిల్లా కోర్టు మెయిన్ గేట్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులు వ్యక్తులపై మాత్రమే కాకుండా, మొత్తం న్యాయ వ్యవస్థపై జరుగుతున్న దాడులేనని వారు స్పష్టం చేశారు. యువ న్యాయవాది స్వప్న గతంలో మూడుసార్లు పోలీసులను ఆశ్రయించినప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, నాలుగోసారి ఆమె తన ప్రాణాలతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు.
కొద్ది రోజుల్లో వివాహం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాల్సిన సమయంలో దుండగుల చేతుల్లో ఆమె భవిష్యత్ చిద్రమైందని లక్కినేని సత్యనారాయణ అన్నారు. ఇది కేవలం ఒక హత్య మాత్రమే కాదని, పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యానికి, పాలనా వైఫల్యానికి వచ్చిన ఘోర ఫలితమని న్యాయవాదులు తీవ్రంగా విమర్శించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే స్వప్న తల్లికి, ఆమె సహచరులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని కోరారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని, న్యాయవాదుల రక్షణ చట్టం అమలులోకి వచ్చే వరకు న్యాయవాదులు నిద్రపోరని స్పష్టం చేశారు. ప్రతి స్వరం ఒక ఉద్యమంగా మారుతుందని, ప్రతి న్యాయవాది ఒక అగ్నికణంగా మారతాడని లక్కినేని హెచ్చరించారు. స్వప్న కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ అండగా నిలుస్తారని ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ లీగల్ ప్రోఫెషనల్స్ అసోసియేషన్ (ఐ.ఎల్.పి.ఏ) ఐలు, ఐఏఎల్, న్యాయవాది పరిషత్ ప్రతినిధులతో పాటు మహిళా న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.