వానాకాలంలో జుట్టును సంరక్షించుకోవడం చాలాకష్టంగా ఉంటుంది. ఉదయాన్నే తలస్నానం చేసి, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఓ చిన్నపాటి వర్షం అంతా చెడగొట్టేస్తుంది. వానలో తడిసి ఇంటికి తిరిగి వచ్చేసరికి స్కాల్ప్ జిడ్డుగా, బంకగా మారిపోతుంది. మహా చికాకు పెట్టేస్తుంది. ఇలా జరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిని తెలుసుకొని, పరిష్కార మార్గాలు అన్వేషిస్తే..
వర్షంలో తడిసినప్పుడు జుట్టు మొత్తం కిందికి అణిగిపోతుంది. దాంతో వెంట్రుకలు తమ ఒత్తయిన రూపు కోల్పోయి.. మాడుపై ఉండే సహజసిద్ధమైన నూనెలు బయటికి కనిపిస్తాయి. అందువల్లే.. జుట్టు జిడ్డుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక వర్షాకాలంలో తేమ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే, భారీ వర్షం పడిన తర్వాత కూడా విపరీతంగా చెమట పడుతుంది. ఈ చెమట.. మాడుపై ఉండే సహజ నూనెలతో కలిసి జుట్టును బరువుగా, జిడ్డుగా మార్చేస్తుంది. వర్షపు నీటిలో ఎన్నో రకాల కాలుష్య కారకాలు కలుస్తాయి. ఇవి జుట్టుకు అంటుకోవడం వల్ల జుట్టు మురికిగా తయారవుతుంది. అంతేకాకుండా.. కొన్నిరకాల హెయిర్ కేర్ ఉత్పత్తులు పొడి జుట్టుపై మాత్రమే వాడాల్సి ఉంటుంది. వర్షం నీటిలో తడిసినప్పుడు.. ఆయా ప్రొడక్ట్స్ మళ్లీ యాక్టివేట్ అవుతాయి. దాంతో మాడు మామూలు కన్నా ఎక్కువ బంకగా మారిపోతుంది. మొత్తానికి తలస్నానం చేసి, జుట్టు సంరక్షణ కోసం రకరకాల ఉత్పత్తులు వాడినా.. ఓ చిన్న వర్షంతో నెత్తి మొత్తం జిడ్డుగా తయారవుతుంది. ఈ సమస్యను నివారించడానికి, జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.