హైదరాబాద్ ఫిబ్రవరి 5 : ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న ‘ఎప్స్టీన్ ఫైల్స్’లో ప్రధాని నరేంద్ర మోడీ పేరు బయటపడటం భారత మహిళల గౌరవానికి, దేశ ప్రతిష్టకు సంబంధించిన అత్యంత తీవ్రమైన అంశమని ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖ బోయలపల్లి (Boyalapalli Rekha) మండిపడ్డారు. ఎప్స్టీన్ నీడలో విశ్వగరు ఇమేజ్ అని పేర్కొన్న ఆమె..“శిక్షపడిన నేరస్థుడి చెత్త ఊహాగానాలు” అంటూ కేంద్రం తప్పించుకోవడం సత్యాన్ని సమాధి చేయడమేనని ఆమె అన్నారు. ‘బేటీ బచావో’ అని నినదించే మోడీ ప్రభుత్వం మహిళలపై లైంగిక నేరాలకు కేంద్రమైన ఎప్స్టీన్ వ్యవహారంలో ఎందుకు నోరు మెదపడం లేదు? అని రేఖ ప్రశ్నించారు.
అమెరికా ప్రభుత్వం బయపెట్టిన 30 లక్షల ఎప్స్టీన్ ఫైల్స్లో పలువురు సెలబ్రిటీలతో పాటు ప్రధాని మోడీ పేరు ఉండడం.. కేంద్రం దాటవేత ధోరణని బోయలపల్లి రేఖ ఖండించారు. మణిపూర్లో హింసాత్మక ఘటనలు, ఉన్నావ్, హత్రాస్ హత్యాచార ఉదంతాల్లోనూ మౌనం వహించిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు మరోసారి మహిళల పట్ల తన నిజ స్వరూపం చూపుతోందని ఆమె ధ్వజమెత్తారు. మీడియాతో మాట్లాడిన ఆమె ఎప్స్టీన్ ఫైల్స్లో ప్రధాని మోడీ పేరు రావడంపై కొన్ని కీలకమైన డిమాండ్లు చేశారు.
పార్లమెంట్లో ప్రధాని తక్షణమే వివరణ ఇవ్వాలి, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలి. నిజాలు తేలేవరకు మోదీ పదవి నుంచి వైదొలగాలి. పార్లమెంట్లో ఈ వ్యవహారంపై సమగ్ర చర్చకు వెంటనే అనుమతి ఇవ్వాలి. “ఇది వ్యక్తిగత అంశం కాదు దేశ మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటం” అని మహిళా కాంగ్రెస్ ఉపాధ్యోరాలు రేఖ స్పష్టం చేశారు.