కోటగిరి, ఆగస్టు 1: తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన చురుకైన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందని, ఆయన సేవలు చిరస్మరణీయమని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకులు తెల్ల రవికుమార్, మోరే కిషన్, ఎత్తొండ దేవేందర్ కొనియాడారు.
శనివారం కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కోటగిరి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ నాయకులు తీవ్ర దిగ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పేరే ఒక ఉత్తేజం. వరంగల్ గడ్డమీద అనేక సవాళ్లను ఎదుర్కొంటూ, ఒడిదుడుకులను అధిగమించి ప్రత్యేక పోరాట జెండాను నింగినెత్తిన ధీశాలి.. ఆర్థిక బలం లేకున్నా ఆత్మీయ బలంతో ప్రజాక్షేత్రంలో ఉద్యమ జెండాను భుజానికి ఎత్తుకున్నారన్నారు. నర్సంపేట మట్టిలో ఆయన ముద్ర చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.