భువనగిరి కలెక్టరేట్, సెప్టెంబర్ 10 : రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం చందుపట్ల పీఏసీఎస్ పాలకవర్గం, సిబ్బందిని అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు నిర్బంధించారు. భువనగిరి మండలంలోని చందుపట్ల పీఏసీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం చందుపట్ల రైతువేదికలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బ్యాంకు పరిధిలోని ఎనిమిది గ్రామాల రైతులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తమకు రుణమాఫీ ఎందుకు కాలేదని రైతులు పాలకవర్గాన్ని నిలదీశారు. ఈ క్రమంలో రైతులు ఆగ్రహానికిలోనై పాలకవర్గ సభ్యులను, బ్యాంకు సిబ్బందిని గదిలో వేసి తాళం వేశారు. రుణమాఫీపై స్ఫష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ అంజిరెడ్డి రైతువేదిక వద్దకు వచ్చి రుణమాఫీపై హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.