హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై అక్రమ కేసులు(Illegal cases) పెట్టడమే ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రశ్నించిన వారిని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నది. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తేలేదని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై. సతీష్ రెడ్డి(Y.Satish reddy) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నేటి వరకు ఈ పరంపర కొనసాగిస్తున్నదని విమర్శించారు.
అధికారంలోకి వచ్చీ రాగానే డిసెంబర్ 4నే హుజురాబాద్ లో రావుల భరత్ రెడ్డి అనే బీఆర్ఎస్ కార్యకర్తపై కేసు పెట్టారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై లాఠీచార్జీకి నిరసనగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు అతనిపై ఓ పోలీసు ఫిర్యాదు చేస్తే కేసు పెట్టారు. అలాగే.. డిసెంబర్లో పంటలు ఎండిపోతున్నాయి. కాలువల్లో నీళ్లు రావడం లేదని ప్రశ్నించినందుకు తుంగతుర్తికి చెందిన సురేష్ యాదవ్ పై డిసెంబర్ 20న దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి, అట్రాసిటీ కేసు పెట్టారు.
ప్రభుత్వాన్ని విమర్శించాడని కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం పచ్చునూర్ కు చెందిన పిట్టల శ్రవణ్ పై సైబర్ క్రైమ్ పోలీసులు మార్చి 5న కేసు పెట్టారు. మార్చి 15న పంటలు ఎండుతున్నాయని ఎండిన పంటల వీడియో తీసి రైతులతో మాట్లాడించి సోషల్ మీడియాలో పెట్టిన ధర్మపురికి చెందిన సల్వాజీ మాధవరావుపై దాడి చేశారు. పైగా అతనిపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి జైలుకు పంపించారని గుర్తు చేశారు.
ఓయూలో నీరు, కరెంటు కొరత ఉందంటూ సెలవులు ప్రకటిస్తూ హాస్టల్ వార్డెన్ ఇచ్చిన సర్క్యులర్ ను సోషల్ మీడియాలో పెట్టినందుకు మే 1వ తేదీన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాగేందర్ పై కేసు పెట్టారు. జైలుకు పంపించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తన సోషల్ మీడియాలో ఫేక్ సర్క్యులర్ ని పోస్ట్ చేశారు. అయినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కొణతం దిలీప్, హరీష్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇలా అనేక మందిపై కేసులు పెట్టారని మండిపడ్డారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారని ఆరోపించారు. కేసులకు భయపడి ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపడం ఆపేస్తారని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టున్నారు. కానీ, మేమంతా కేసీఆర్ గారు తయారు చేసిన సైనికులం, ఉద్యమం చేసి లాఠీ దెబ్బలు తిని, తూటాలకు ఎదురెల్లినోళ్లం. ఇలాంటి పిట్ట బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరికి అధికారం శాశ్వతం కాదు అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హితవు పలికారు.