హైదరాబాద్ : నువ్వు సిగ్గులేనోడివి.. నీ మాటలు రండ మాటలు.. నీ చేతలు రండ చేతలు.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి(Y. Satish Reddy) ఫైర్ అయ్యారు. కృష్ణా ప్రాజెక్టు(Krishna Project)లను కేంద్రానికి అప్పగించిన విషయంపై ఘాటుగా స్పందించారు. సీఎం పదవికి ఉన్న గౌరవాన్ని రేవంత్ రెడ్డి పూర్తిగా తగ్గించేస్తున్నారు.
గౌరవప్రదమైన పదవిలో ఉండి అవాస్తవాలు, అర్ధసత్యాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం, కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. అసలు తెలంగాణ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని రూపొందించింది ఎవరు.? ఆ కమిటీలో ఉన్నది ఎవరు.? అందులో కేసీఆర్ ఉన్నారా.? బిల్లు తయారైన నాడు కేంద్రంలో అధికారంలో ఉన్నది మీ కాంగ్రెస్ పార్టీనే కదా అని ప్రశ్నించారు.
కేసీఆర్‌కు చెప్పే చట్టంలో పొందుపరిచారని చెబుతున్న రేవంత్ రెడ్డి అవివేకానికి ఏం అనాలో అర్థం కావడం లేదన్నారు. నిజంగానే అన్ని అంశాలు కేసీఆర్ కు చెప్పి చేరిస్తే.. నీళ్ల వివాదం, ఏడు మండలాలు లాగేసుకోవడం ఇవన్నీ ఎందుకు ఉండేవి.? ఆనాడు ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పాలని.. కేంద్రంలో ఉన్న మీరే చట్టంలో పెడతారు. ఇవాళ మీరే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి చట్టాలను కేంద్రం చేతుల్లో పెడతారు.
కేసీఆర్‌పూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారు. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఏమైనా ఉందా.? అని నిలదీశారు.
మీరు చెప్పినట్టు 2021లోనే ప్రాజెక్టు అప్పగించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకరిస్తే ఇప్పటిదాకా ఎందుకు ఆగింది.? రెండు నెలల క్రితం వరకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా ఉంది. అయినా కేంద్రానికి ఎందుకు అప్పగించలేదన్నారు. మీరు వచ్చీ రాగానే ఆగమేఘాలమీద కేంద్రం చేతుల్లో ఎందుకు పెట్టారు. వాస్తవానికి కృష్ణా బోర్డు ముందు తెలంగాణ ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టింది.
ఆ షరతులకు ఒప్పుకుంటేనే కేంద్రానికి అప్పగిస్తామని చెప్పింది. కానీ రేవంత్ రెడ్డి సర్కారు అప్పనంగా కేంద్రంలో చేతుల్లో పెడతామని చెప్పి.. ప్రజల్లో వ్యతిరేకత వచ్చే సరికి మాట మార్చిందని పేర్కొన్నారు. మీటింగ్ మినిట్స్‌లో తప్పు రాశారని.. దాన్ని సవరించాలని బోర్డుకు లేఖ రాశామని కొత్త డ్రామా మొదలు పెట్టారు. పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా ఆనాడు కొట్లాడింది టీఆర్ఎస్ పార్టీ నాయకులే.
పదవులను సైతం పణంగా పెట్టి కొట్లాడి పదవులను సైతం వదిలేశారు. కానీ ఆనాడు నువ్వు ఎక్కడున్నవ్ రేవంత్ రెడ్డి.? చంద్రబాబు సంకలో కూర్చోని తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా.. నవరంద్రాలు మూసుకుని కూర్చున్నావని మండిపడ్డారు. ఇవాళ వచ్చి శుద్ధపూస మాటలు చెప్పినంత మాత్రానా నువ్ గొప్పోడివైపోవు. రేవంత్ రెడ్డి మొదట భాష మార్చుకోవాలని సూచించారు. ఆయన ఉన్నది ముఖ్యమంత్రి పదవిలో అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. మీ మాటలను, మీ చేతలను అన్నింటిని ప్రజలను గమనిస్తున్నారు.
గొప్పవాళ్లను తిట్టినంత మాత్రానా గొప్పవాడివైపోతావని అనుకుంటున్నావేమో.. కానీ గాడిదకు రంగేసినంత మాత్రానా సింహంగా మారదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం మీద శ్రద్ధ పెట్టు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఒకటే పని నడుస్తోంది. తప్పు చేయడం దాన్ని గత ప్రభుత్వం మీదకు నెట్టివేస్తుందని ఆరోపించారు.
అందులోనూ ఏదైనా మంచి ఉంటే తమ ఖాతాలో వేసుకోవడం చేస్తోంది. చివరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసి పరీక్షలు పూర్తి చేస్తే.. ఇప్పుడు నియామక పత్రాలు ఇచ్చి ఆ ఉద్యోగాలు తమ ఖాతాలోనే వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 60 రోజుల పాలన అంతా అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు, బూతులు తప్పా ఏమీ లేదు. ఇదే పద్ధతి కొనసాగితే నీ పరువే కాదు.. రాష్ట్రం పరువు పోతుంది. ఇకనైనా ముఖ్యమంత్రిగా మసులుకో.. వీధిరౌడి వేషాలు మానేయాలని రేవంత్ రెడ్డికి హితవు పలికారు.