హైదరాబాద్ : ఫార్ములా ఈ రేసు(Formula e race) విషయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై(KTR) కాంగ్రెస్ సర్కారు దుర్మార్గ పూరితంగా తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ వ్యవహారంలో అసలు దోషి రేవంత్ రెడ్డి. ప్రస్తుతం రాష్ట్రానికి మున్సిపల్ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డే.. రూ.50 కోట్లు నష్టపోవడానికి కారణమయ్యారని టీఎస్ రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రానికి రావాల్సిన దాదాపు రూ. 800 కోట్ల నుంచి రూ.900 కోట్ల పెట్టుబడులు రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. కావున రేవంత్‌పై చర్యలు తీసుకొని జైలుకు పంపాలన్నారు.ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలు ఆసక్తి చూపించేలా వారికి అవగాహన కల్పించే ఉద్దేశంతో నాడు ఫార్ములా ఈ రేస్ నిర్వహించడానికి మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఎంత కష్టపడ్డారో.. రెన్యూయెబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నేను దగ్గరుండి చూశాన్నారు.
ఫార్మూలా ఈ ఆపరేషన్స్ సంస్థను ఒప్పించి, ప్రమోటర్లను తీసుకొచ్చి విజయవంతంగా ఈవెంట్ నిర్వహించారు. మొట్టమొదటి ఫార్ములా ఈ రేస్ ఎక్కడ జరిగింది అంటే.. హైదరాబాద్ లోనే అని భవిష్యత్ తరాలు కూడా చెప్పుకుంటాయి. అంతేకాదు ఈ మొబిలిటీ వీక్ పేరుతో కార్యక్రమాలుచేపట్టి ఎలక్ట్రిక్ వాహనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. అలాగే ఫార్ములా ఈ రేస్ నిర్వహణతో హైదరాబాద్‌కు గ్లోబల్ ఇమేజ్ వచ్చింది. అంతర్జాతీయ ప్రముఖులు, సినీ, క్రీడారంగా ప్రముఖులు హైదరాబాద్‌కు వచ్చి ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.
ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా ఫార్ములా ఈ రేస్ ను స్వాగతించారు. స్వయంగా ఆయన కుమారుడే ఈ రేస్ లో పాల్గొన్నారని పేర్కొన్నారు. 2023లో జరిగిన ఈవెంట్‌కు ప్రభుత్వం చేసిన ఖర్చు ఒక్క రూపాయి కూడా వృథా కాలేదు. దాదాపు రూ.700 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయన్నారు. ప్రభుత్వం స్వయంగా ఖర్చు పెట్టింది తక్కువే అయినా.. రాష్ట్రానికి జరిగిన లాభం మాత్రం చాలా ఎక్కువని స్పష్టం చేశారు. 2024లో కూడా రేస్ మన రాష్ట్రంలోనే జరగాలని, మరిన్ని పెట్టుబడులు వస్తాయని కేటీఆర్ భావించారు.
కానీ ప్రమోటర్‌గా ఉన్న సంస్థ మధ్యలో తప్పుకోవడంతో.. హెచ్ఎండీఏను ప్రమోటర్‌గా చేర్చి దాని నుంచి అధికారికంగానే ఫార్మూలా ఈ ఆపరేషన్స్ సంస్థకు డబ్బులు చెల్లించారన్నారు. ఇందులో ఎక్కడా కూడా అవినీతి జరగలేదనేది రేవంత్ రెడ్డికి, ప్రస్తుత సర్కారులో ఉన్నవాళ్లందరికి తెలుసునని స్పష్టం చేశారు. ఒకవేళ రేస్ జరిగి ఉంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. పెట్టుబడులు వచ్చేవి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను పెంచే, పెట్టుబడులు తీసుకొచ్చే ఈవెంట్ ను కావాలనే పక్కనపెట్టిందని మండిపడ్డారు. రాష్ట్రానికి మున్సిపల్ మంత్రి లేకపోవడం, ముఖ్యమంత్రి తన దగ్గరే ఆ శాఖను పెట్టుకోవడం వల్ల సమస్య వచ్చిందని ఆరోపించారు.
ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసే పరిస్థితి లేక.. ప్రజలను ఎలా డైవర్ట్ చేయాలో ఆలోచనలో ఉండి.. ఫార్ములా ఈ రేస్ ను పట్టించుకోలేదు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోయే సరికి, అప్పటికే ఆసక్తిగా ఉన్న తమిళనాడు ప్రభుత్వం ఈవెంట్ ను ఎగరేసుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవంతంగా రేస్ నిర్వహించింది. రేస్ నిర్వహిస్తేనే అవకతవకలు జరిగాయంటే.. తమిళనాడులో ఉన్న కాంగ్రెస్ మిత్రపక్షం డీఎంకే కూడా తప్పు చేసిందా.? అవినీతికి పాల్పడిందా.? అనేది కూడా కాంగ్రెస్ పార్టీనే చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, దుర్భుద్ది వల్ల రాష్ట్రానికి రూ.800 కోట్లకు పైగా నష్టం జరిగింది. కొత్తగా రావాల్సిన పెట్టుబడులు రాకుండా పోయాయి. హెచ్ఎండీఏ అధికారికంగా చెల్లించిన రూ.50 కోట్లు కూడా ఆ కంపెనీనే ఉంచేసుకుందని పేర్కొన్నారు. ఇలా రాష్ట్రానికి అన్నివిధాలా నష్టం చేసిన రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి. అతనిపై కేసు పెట్టి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.