కరీంనగర్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సింగరేణిలో మరో గోల్మాల్ జరిగిందా? బొగ్గు ఉత్పత్తితో ప్రపంచానికి వెలుగులు నింపుతున్న సంస్థ వరుస కుంభకోణాలతో చీకట్లలోకి జారిపోతున్నదా? 2024-25 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తిని కృత్రిమంగా పెంచి చూపించారని తాజాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకటి రెండు కాదు, దాదాపు 38 లక్షల టన్నుల ఉత్పత్తిని పెంచి చూపించారన్న వార్తలు సింగరేణి సంస్థలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు ఓ ఉన్నతాధికారి చేసిన నిర్వాకం, ఇప్పుడు సంస్థను బదనాం చేయడమేకాకుండా, ఆర్థికంగానూ భారీ నష్టాన్ని కలిగిస్తున్నదట.
ఒక్క మాటలో చెప్పాలంటే, సింగరేణి సంస్థను పెను ప్రమాదంలోకి నెట్టిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. కృత్రిమంగా పెంచి చూపిన బొగ్గు విలువ మార్కెట్ ధర ప్రకారం రూ.3వేల కోట్ల నుంచి రూ.4,500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ అబద్ధపు ఉత్పత్తికి సంబంధించిన లాభాలపై కంపెనీ వివిధ రకాల పన్నులు చెల్లించాల్సి వస్తున్నదని, దీంతో భారీ ఆర్థిక నష్టం వాటిల్లడంతోపాటు మార్కెట్లో సింగరేణి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లే పరిస్థితి తలెత్తిందని ఆరోపిస్తున్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో సంస్థ చూపిన బొగ్గు ఉత్పత్తి గణాంకాలకూ, రవాణాకు మధ్య పొంతన లేదన్న చర్చ జరుగుతున్నది. దాదాపు 38 లక్షల టన్నుల మేర బొగ్గు ఉత్పత్తిని కృత్రిమంగా (కాగితాలపై) పెంచి చూపించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 69.01 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించినట్టు సంస్థ గతంలో ప్రకటించింది. అయితే రవాణా మా త్రం 65.23 మిలియన్ టన్నులు మాత్రమే జరిగినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
సాధారణంగా ఉత్పత్తికీ, రవాణాకు మధ్య స్వల్ప తేడా ఉండటం సహజమేనని, ఏకంగా దాదాపు 38 లక్షల టన్నులకు పైగా వ్యత్యాసం ఉండటం సింగరేణి చరిత్రలో ఎప్పుడూ జరుగలేదని చెప్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ‘సత్యం కంప్యూటర్స్’ తరహాలో అకౌంటింగ్ అక్రమాలను తలపిస్తున్నదని నిపుణులు పేర్కొంటున్నారు.
లెక్కల్లో ఈ అంతరం వెనుక కూడా పెద్దల హస్తం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలకు 2024 డిసెంబర్లో జరిగిన సమీక్ష సమావేశంలో బీజం పడినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నిర్దేశించిన లక్ష్యానికీ, వాస్తవ ఉత్పత్తికీ మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్టు ఈ సమీక్షలో గుర్తించారని సమాచారం. వాస్తవాలు బయటకు వస్తే తన ఉనికికే ప్రమాదమని అప్పటి అత్యున్నత స్థాయి అధికారి భావించారని, తన ప్రతిష్ట కోసం వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారని సింగరేణిలో చర్చ జరుగుతున్నది. బొగ్గు ఉత్పత్తిని పెంచి గణాంకాలు చూపించాలని సదరు ఉన్నతాధికారి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తున్నది. ఇందుకోసం ఎవరికీ అనుమానం రాకుండా రోజూ ఉత్పత్తి గణాంకాలను అంతర్గతంగా పెంచి చూపాలని ప్రతిపాదించినట్టు సమాచారం. ఇందుకు అప్పటి ఓ డైరెక్టర్ తీవ్ర అభ్యంతరం తెలిపినట్టు తెలిసింది. దీంతో సదరు డైరెక్టర్‌పై ఆ ఉన్నతాధికారి నోరుపారేసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘నేను మంచి పేరు తెచ్చుకోవడం మీకు ఇష్టం లేదా? నా పనితీరు మెరుగ్గా ఉన్నట్టు కనిపిస్తే మీకు నచ్చదా?’ అంటూ సదరు ఉన్నతాధికారి విరుచుకుపడటంతో డైరెక్టర్ మౌనంగా ఉండిపోయారన్న చర్చ జరుగుతున్నది. అంతేకాదు, ఈ విషయం బయటకు వస్తే.. మీ ద్వారానే వచ్చినట్టు భావిస్తామని సదరు డైరెక్టర్‌కు వార్నింగ్ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.
ఎవరికీ అనుమానం రాకుండా ఉత్పత్తిని పెంచి చూపేందుకు సదరు ఉన్నతాధికారి ప్రత్యేకంగా ఒక అధికారికి బాధ్యతలు అప్పగించారట. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న జీఎం స్థాయి అధికారిని ఎంపిక చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటువంటి వ్యవహారాలు చక్కబెట్టడంలో ఆయన అందవేసిన చేయి అన్న ప్రచారం ఉన్నది. గతంలో శ్రీరాంపూర్ డీజిల్ కుంభకోణంలో ప్రముఖ పాత్ర వహించడంతోపాటు కాంట్రాక్టర్లకు జరిమానాల మినహాయింపులో అనుకూలంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ అధికారి నేతృత్వంలో జనవరి 2025 నుంచి మార్చి 2025 వరకు రోజూ ఉత్పత్తి గణాంకాలను కాగితాలపై పెంచి చూపించినట్టు చర్చ జరుగుతున్నది.
కృత్రిమంగా చూపిన 38 లక్షల టన్నుల బొగ్గు విలువ మార్కెట్ ధర ప్రకారం రూ.3వేల కోట్ల నుంచి రూ.4,500 కోట్ల వరకు ఉంటుందని నిపుణుల అంచనా. కృత్రిమంగా ఉత్పత్తి పెరిగినట్టు చూపడంతో కంపెనీ లాభాలను పెంచి చూపించాల్సి వచ్చిందని, దీంతో పన్నుల భారం తడిసి మోపెడైనట్టు తెలుస్తున్నది. అబద్ధపు లాభాలపై కంపెనీ భారీగా ఆదాయపుపన్నుతోపాటు పలు రకాల పన్నులు చెల్లించాల్సి వస్తున్నదని సమాచారం. మొత్తంగా సంస్థపై రూ.వందల కోట్ల మేర భారం పడుతుందని అంటున్నారు. అంతేకాకుండా, ఇప్పుడు పెంచిచూపిన ఉత్పత్తిని సర్దుబాటు చేయడానికి 2025-26లో ఉత్పత్తిని తగ్గించి చూపించాల్సివచ్చే ప్రమాదం ఏర్పడిందని కార్మిక వర్గాలు చెప్తున్నాయి. ఇది సంస్థ భవిష్యత్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇది కేవలం గణాంకాల పొరపాటుకాదని, ఉద్దేశపూర్వకమైన మోసమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే నిజమైతే కంపెనీ బదనాం అవుతుందని, భవిష్యత్‌లో పెను ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల వెలుగులోకి వచ్చిన నైని బ్లాక్ టెండర్లలో అక్రమాలు, సైట్ విజిటింగ్ సర్టిఫికెట్ నిబంధన అమలు చేయడం, ముఖ్యనేత బావమరిది చక్రం తిప్పి గనులను దక్కించుకోవడంలాంటి అనేక రకాల కుంభకోణాలు సింగరేణి సంస్థను సతమతం చేస్తున్నాయి. ఈ ఆరోపణలపై విచారణకు కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసినా, నేటికీ అక్రమాల నిగ్గు తేల్చలేదు. కమిటీ తన నివేదికను బహిర్గతం చేయకపోవడం, ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై కార్మిక వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత స్కామ్‌లన్నింటికీ ఇది భిన్నమని కార్మిక సంఘాలు చెప్తున్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని దీనిపై నిష్పాక్షికమైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. అప్పుడే సూత్రధారులు, పాత్రధారులు బయటకు వస్తారని అంటున్నాయి. సింగరేణికి మచ్చ తెచ్చేలా వ్యవహరించిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవడంతోపాటు సంస్థకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సింగరేణి ఉత్పత్తిలో తప్పుడు లెక్కలు చూపడంపై వెంటనే విచారణ జరపాలి. నిజాలు నిగ్గుతేల్చాలి. గతంలో ఎప్పుడూ ఉత్పత్తికీ, రవాణాకు మధ్య ఇంత వ్యత్యాసం లేదు. ఇప్పుడు చూపిన లెక్కలపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ తప్పును కవర్ చేయడానికి మరిన్ని తప్పులు చేస్తున్నారు. ఇటువంటి పనులతో సింగరేణి బదనాం అయ్యే ప్రమాదం ఉన్నది. వాస్తవ లాభాలను మాత్రమే చూపి, అందుకనుగుణంగా ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని కార్మికలోకం కోరిందే తప్ప.. తప్పుడు లాభాలను చూపాలని ఏనాడూ కోరలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ఉత్పత్తికీ, రవాణాకు మధ్య తేడా రావడానికి కారణాలేమిటి అనే విషయంలో లోతైన విచారణ చేయాలి. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలి.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు