Gongidi Sunitha | హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. లేనిపోని అభియోగాలతో పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తంచేసింది. అసలు ఆ పిటిషనర్ వెనుక ఎవరున్నారని ప్రశ్నించింది. ఇలాంటి పిటిషన్లను అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టంచేసింది. ఎమ్మెల్యే సునీత ఆదాయానికి మించి ఆస్తులు ఆర్జించారని పేరొంటూ ఎన్నికల సంఘానికి, ఆదాయపు పన్నుల శాఖకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని యాదాద్రి భువనగిరి జిల్లా గొల్లగూడానికి చెందిన బీ మహేశ్ హైకోర్టును ఆశ్రయించారు.
తమ ఫిర్యాదుపై చర్యలు తీసుకునేలా ఈసీ, ఐటీ శాఖలకు ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషనర్ అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం తోసిపుచ్చింది. ఇదొక బోగస్ పిటిషన్, బ్లాక్‌మెయిలింగ్ పిటిషన్ అని వ్యాఖ్యానించింది. అసలు పిటిషనర్ ఐటీ శాఖకు ఆదాయపు పన్నులకు సంబంధించి రిటర్నులు ఫైల్ చేశారా? అని ప్రశ్నించింది. ఐటీశాఖ సమర్పించిన పత్రాలను పరిశీలించిన తర్వాత ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.