CM Revanth Reddy | హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : కొన్ని రాజకీయ పార్టీలు, స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలికావొద్దని, నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే నోటిఫికేషన్లు రద్దయి ఉద్యోగాల భర్తీ నిలిచిపోయి నిరుద్యోగులు మరింత నష్టపోతారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని, నిరుద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. నిరుద్యోగుల ఆందోళనల దృష్ట్యా శుక్రవారం సాయంత్రం తన నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రకటన విడుదల చేశారు.
పరీక్షల సమయంలో ఇష్టమొచ్చినట్టు నిబంధనలు మార్చడం వల్ల తలెత్తే చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి, ఉద్యోగాల భర్తీకి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు, వివిధ బోర్డులు నిర్వహించే పరీక్షలతో ఆటంకాలు కలగకుండా అభ్యర్థులకు పూర్తి న్యాయం జరిగేలా క్యాలెండర్ రూపొందిస్తామనని వివరించారు.
సమావేశంలో భాగంగా నిరుద్యోగుల ప్రధాన డిమాండ్లు, పరిష్కారంలో ఇబ్బందులపై అధికారులు వివరణ ఇచ్చారు. గ్రూప్-1 మెయిన్స్‌కు 1: 100 చొప్పున ఎంపిక చేస్తే కోర్టులు జోక్యం చేసుకునే ప్రమాదమున్నదని పేర్కొన్నారు. గ్రూప్-2, 3 పోస్టులు పెంచితే నోటిఫికేషన్‌ను ఉల్లంఘించినట్టే అవుతుందని, అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకునే అవకాశముందని చెప్పారు.
నిరుద్యోగుల ఉద్యమ సెగ సర్కారుకు గట్టిగానే తగిలింది. దీంతో ఇన్నాళ్లూ బెట్టుచేసిన రేవంత్ సర్కారు ఓ అడుగు దిగివచ్చింది. డీఎస్సీ లేదా గ్రూప్-2 పరీక్షల్లో ఏదో ఒకటి వాయిదా వేసే దిశగా ముందుకుపోతున్నది. నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇవి రెండూ ఒకదాని వెంటే మరొకటి నిర్వహిస్తుండడాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. సమావేశంలోనూ సీఎం ఇదే అంశంపై చర్చించినట్టు తెలిసింది. పరీక్షల తేదీల విషయంలో టీజీపీఎస్సీ, విద్యాశాఖతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రూప్-2 వాయిదా వేస్తారా? లేక డీఎస్సీనా? అనేది స్పష్టతనివ్వకపోవడంతో అభ్యర్థులో టెన్షన్ నెలకొంది.