SLBC | అచ్చంపేట, ఏప్రిల్ 16 : శ్రీశైలం ఎడమగట్టు సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ లోపల ఇంకా 50 మీటర్ల పొడవు, 3 మీటర్ల ఎత్తు మేర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో మిగిలిన ఆరుగురి మృతదేహాల వెలికితీతకు 54 రోజులుగా అన్వేషణ చేస్తున్నారు. బండరాళ్లు, బురద, శిథిలాలను తొలగించే పనులు వేగవంతం చేశారు.
బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామంలో ఎస్ఎల్బీసీ, టన్నెల్ లోపల కొనసాగుతున్న సహాయక చర్యలపై సింగరేణి మైన్స్ రెస్క్యూ, ఎస్డీఆర్ఎఫ్, దక్షిణ మధ్య రైల్వే, జేపి కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజినీర్ సంజయ్ కుమార్ సింగ్, హైడ్రా, అధికారులు, సహాయక బృందాల ఉన్నతాధికారులతో టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు పూర్తిస్థాయిలో సమన్వయంతో సహాయక చర్యలను చేపడుతున్నట్లు, సహాయక చర్యలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన యంత్రాల ద్వారా, టన్నెల్ నిర్మాణంలో నిష్ణాతులైన అధికారుల సూచనలు, సలహాలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని వివరించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల ప్రమాదం జరిగిన రోజు నుండి నిర్విరామంగా టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు జరుగుతున్న సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయని, ఇంకా 50 మీటర్ల పొడవు, 3 మీటర్ల ఎత్తు మేర సహాయక చర్యలు చేపట్టాలని తెలియజేశారు. సొరంగం లోపల ఎస్క్వేటర్లు, బాబ్ క్యాట్లు, పెద్ద పెద్ద బండ రాళ్లను తొలగిస్తూ, కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని టన్నెల్ బయటకు తరలిస్తున్నట్లు, కత్తిరించిన టిబిఎం భాగాలను లోకో ట్రైన్ ద్వారా టన్నెల్ బయటికి పంపుతున్నట్లు తెలిపారు. డి వాటరింగ్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు ఎప్పటికప్పుడు టన్నెల్ లోపల జరుగుతున్న సహాయక చర్యలపై నివేదికలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి వివరించారు.