హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): ‘కష్టం మీది.. పేరు మాది’ అన్నట్టుగా తయారైంది రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తీరు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు వేసి.. సంస్కరణలు తెచ్చి.. వ్యయప్రయాసలకోర్చి.. ఇటుకాఇటుక పేర్చి చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఇప్పుడు తమదే పేటెంట్ అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలకు పోతున్నది. కేసీఆర్ హయాంలో దాదాపుగా పూర్తైన పలు ప్రాజెక్టులకు రిబ్బన్ కట్ చేసి ఆర్భాటంగా ప్రారంభోత్సవాలు చేస్తున్నది. తద్వారా పైసా ఖర్చు చేయకుండా, ఇసుమంత శ్రమ కూడా పడకుండా రేవంత్ ప్రభుత్వం క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించి, శంకుస్థాపనలు చేసి, సింహభాగం పనులు పూర్తి చేసిన భారీ ప్రాజెక్టులను.. కేవలం రిబ్బన్ కటింగులు చేసి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటున్నదని తెలంగాణ వాదులు విమర్శిస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన ఫ్లై ఓవర్లు మొదలుకొని.. పల్లెల్లో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల వరకు దాదాపు 27కు పైగా మెగా ప్రాజెక్టులు బీఆర్ఎస్ విజన్‌కు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తుండగా, వాటిపై తమ ముద్ర వేసుకోవడానికి కాంగ్రెస్ సర్కార్ విఫలయత్నం చేస్తున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఫ్లైఓవర్లపై ఇలా..
బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగింది. ఉపాధి అవకాశాలు పెరుగడంతో దేశం నలుమూలల నుంచీ ఉద్యోగార్థులు సిటీకి క్యూకట్టారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ కష్టాలు కూడా పెరిగాయి. ట్రాఫిక్ సిగ్నల్‌లో గంటలపాటు నిరీక్షించే ఉద్యోగులు.. ‘ఇక్కడ ఓ ఫ్లై ఓవర్ కడితే ఎంత బాగుండో’ అంటూ మనసులో అనుకున్న సందర్భాలు కోకొల్లలు. హైదరాబాద్ వాహనదారుల కష్టాలను గుర్తించిన అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ఓ బృహత్ ప్రణాళిక అమలు చేశారు. ఈ క్రమంలోనే స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డీపీ) ప్రాజెక్టు పురుడుపోసుకున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా వందలాది ఫై ఓవర్లు, అండర్‌పాస్‌లు, బ్రిడ్జిలు, గ్రేడ్ సెపరేటర్స్ ఇలా ఎన్నో పనులు శరవేగంగా పూర్తయ్యియి. ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు కింద చేపట్టిన అనేక అభివృద్ధి పనులను బీఆర్ఎస్ హయాంలోనే పూర్తిచేసింది. అయితే ఎన్నికల కోడ్ రావడం, కొద్దిమొత్తంలో పనులు మిగిలిపోవడంతో ప్రారంభోత్సవాలు వాయిదా పడ్డాయి. తీరా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వాటికి రిబ్బన్లు కత్తిరించి వీటన్నింటినీ తామే పూర్తి చేసినట్టు క్రెడిట్ కొట్టేస్తుండటం విమర్శలకు తావిస్తున్నది. ఇలా కాంగ్రెస్ సర్కార్ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్న వాటిలో ఆరాంఘర్-ఉప్పరపల్లి ఫ్లై ఓవర్, పీజేఆర్ ఫ్లై ఓవర్, గోపన్‌పల్లి ఫ్లై ఓవర్, బైరామల్ గూడ ఫ్లై ఓవర్, బాచుపల్లి ఫ్లై ఓవర్ తదితరాలున్నాయి.
కట్టడాల రక్షణకు కృషి
అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని కాపాడుతూ వాటి విశేషాలు భావితరాలకు తెలియజేసేందుకు బీఆర్ఎస్ సర్కార్ ఎంతగానో కృషిచేసింది. ఇందులో భాగంగానే పలు కట్టడాలను నిర్మించడంతో పాటు హెరిటేజ్ కట్టడాలను కాపాడే బాధ్యత తీసుకున్నది. కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్, వరంగల్‌లో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం, కొత్వాల్‌గూడ ఎకో పార్తో పాటు మూసీనది ప్రక్షాళన అంటూ ఇప్పుడు కాంగ్రెస్ ఊదరగొడుతున్న ప్రాజెక్టును కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలోనే పూర్తిచేసింది. నగరంలో మురుగునీటి శుద్ధి కోసం కోట్లాది రూపాయలతో 6 భారీ ఎస్టీపీలను (మీర్ఆలం, నాగోల్, ఖాజాకుంట, ఫతేనగర్, సఫిల్‌గూడ, నల్లకుంట) నిర్మించింది అప్పటి కేసీఆర్ ప్రభుత్వమే. ఇప్పుడు కాంగ్రెస్ సరార్ వాటికి రిబ్బన్లు కట్ చేస్తూ ఈ ఘనతంతా తమదేనని చెప్పుకోవడంపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు.
పల్లెల్లోనూ కేసీఆర్ ముద్ర
ఒక్క హైదరాబాద్ అభివృద్ధి మాత్రమే కాదు.. తెలంగాణ పల్లెల రూపురేఖలు, వ్యవసాయ దశదిశను మార్చిన ఘనత కూడా గత బీఆర్ఎస్ సర్కార్కే దక్కింది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో కునారిల్లిన తెలంగాణ వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టేందుకు, రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు కేసీఆర్ సర్కార్ ఎంతగానో కృషిచేసింది. తెలంగాణ సాగు, తాగునీటి కష్టాలను తీర్చడానికి ఉద్దేశించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సీతారామ వరకు అన్నింటిపై నాడు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బుదరజల్లే కార్యక్రమాన్ని నెత్తినేసుకొన్నది. తీరా అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయించింది. బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపనలు చేసి మెజారిటీ పనులు పూర్తి చేసిన ఆయా ప్రాజెక్టులకు ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ ఫొటోలకు పోజులిస్తూ రిబ్బన్లు కట్ చేసి ప్రారంభోత్సవాలు చేస్తున్నది. ఒకవిధంగా బీఆర్ఎస్ సర్కార్ విత్తనం నాటి నీళ్లు పోసి పెంచిన చెట్టు నుంచి ఇప్పటి కాంగ్రెస్ ఫలాలు తెంపుకొంటున్నది. ఈ జాబితాలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, దేవాదుల (దేవన్నపేట పంప్‌హౌస్), ఉదయ సముద్రం (బ్రాహ్మణ వెల్లంల), చనాక – కొరట, తుపాకులగూడెం (సమ్మక బరాజ్), సదర్ మాట్ బరాజ్ ఇలా అనేక ప్రాజెక్టులున్నాయి.
ఫ్లెక్సీలతో చెరిపేయాలని..
శ్వేతపత్రాల పేరిట అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై, నాటి అభివృద్ధి ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ బురదజల్లిన విషయం తెలిసిందే. చివరికి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తొలిరోజుల్లో నాటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ విషం చిమ్మే ప్రయత్నం చేసింది. ఇప్పుడు అదే ప్రాజెక్టుల ద్వారా మైలేజ్ పొందేందుకు తాపత్రయపడుతుండటం విమర్శలకు తావిస్తున్నది. ఒక ఇటుక పెట్టకుండా, రూపాయి నిధులు కేటాయించకుండా కేవలం ప్రారంభోత్సవాల పేరుతో ఫ్లెక్సీల్లో ఫొటోలు వేసుకోవడానికే రేవంత్‌రెడ్డి సర్కార్ పరిమితమయ్యిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తద్వారా కేసీఆర్ విజన్‌ను, కష్టాన్ని తెలంగాణ ప్రజల గుండెల నుంచి ప్రారంభోత్సవ ఫ్లెక్సీలతో చెరిపివేయాలనే కుట్రలు చేస్తున్నదనే విమర్శలున్నాయి.

బీఆర్ఎస్ సర్కార్‌లో పూర్తై.. కాంగ్రెస్ రిబ్బన్ కట్ చేసిన ప్రాజెక్టుల్లో కొన్ని
క్రెడిట్ చోరీ 1
క్రెడిట్ చోరీ 2
బరాజ్‌లు, ప్రాజెక్టులు
క్రెడిట్ చోరీ 3
మురుగునీటి శుద్ధి ఎస్టీపీలు
క్రెడిట్ చోరీ 4
కాలేజీలు, భవన్లు
క్రెడిట్ చోరీ 5
సాంస్కృతిక వైభోగం
క్రెడిట్ చోరీ 6
పార్క్‌లు.. ఫ్యాక్టరీలు
