నిజామాబాద్, ఆగస్టు 2,(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లో రాజీవ్ యువ వికాసం పేరిట ఓ పథకాన్ని ప్రకటించింది. నిరుద్యోగ యువతను మచ్చిక చేసుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కారు అనేక రకాలుగా విధివిధానాలను రూపొందించింది. ఘనంగా ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ ప్రక్రియకు దాదాపుగా నెలన్నర రోజుల పాటు హంగామా సృష్టించారు. ఎంతో ఆశతో యువత స్పందించి దరఖాస్తులు సమర్పించారు. త్వరలోనే అర్హులైన వారికి యూనిట్ల మంజూరు ఉంటుందని ప్రభుత్వం చెప్పింది.
రెండేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర ఆవిరభావ దినోత్సవం రోజున లబ్ధిదారులకు యూనిట్లు ఇస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన సైతం ఇచ్చారు. సీన్ కట్ చేస్తే నెలలు దాటి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ పథకం ఊసే కరువైంది. రాజీవ్ యువ వికాసం అనే పథకం అమలవుతుందా? లేదా? అన్నది అంతుచిక్కడం లేదు. అసలు ఈ పథకం కింద దరఖాస్తులు సమర్పించిన యువతకు ఏదైన సాయం చేస్తారా? లేదా? అనే ప్రశ్నలతో సతమతం అవుతున్నారు. సంబంధిత అధికారులను నిలదీస్తే తమకేమి తెలియదంటూ తప్పించుకుంటున్నారు. ఈ పథకం గురించి అడుగొద్దంటూ దరఖాస్తుదారులకు అధికారుల నుంచి హుంకారింపులు ఎదురవుతున్నాయి. ఎంతో ఆర్భాటం, హంగామా సృష్టించి మాజీ ప్రధానమంత్రి పేరిట తీసుకు వచ్చిన పథకాన్ని నీరుగార్చడం రేవంత్ రెడ్డి సర్కారుకు తగదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక అలవికాని హామీలు గుప్పించింది. నోటికొచ్చిన పథకాన్ని ప్రకటించారు. అన్ని వర్గాలకు తాయిళాలు అందించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పథకాలను అమలు చేస్తామంటూ తమ అనుకూల మీడియాలో ప్రచారం కూడా చేసుకున్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకు బీఆర్ఎస్ సర్కారు అమలు చేసిన పథకాలపై చెడు ప్రచారం చేయించారు. అబద్ధాలతో, అసత్య ఆరోపణలతో ప్రజలను గందరగోళంలో పడేసి వారి ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం ఒక్కోటి బయట పడుతోంది. రాజీవ్ యు వికాసం పథకం కూడా అందులో భాగంగానే కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకంపై వేగంగా అడుగులు వేయడం ద్వారా యువతకు పెద్ద పీట దక్కుతుందనే స్థాయిలో దరఖాస్తుదారులంతా ఆశ పడ్డారు.
రాయితీతో కూడిన రుణాలు ఇస్తామని చెప్పడంతో రాజీవ్ యువ వికాసం పథకానికి డిమాండ్ ఏర్పడింది. స్వయం ఉపాధిపై బతకాలని ఆశించిన వారంతా ఎంతో ఉత్సాహ పడ్డారు. అధికారంలోకి వచ్చి 32 నెలలు పూర్తవుతుండగా కీలకమైన పథకంపై మాట ఎత్తకపోవడం విడ్డూరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు చేసే నిత్య ప్రకటనలు కేవలం పత్రికలకే పరిమితం అవుతున్నాయి. ఆచరణలో ఇసుమంతైనా పురోగతి కానరావడం లేదంటూ ప్రజలంతా మండి పడుతున్నారు.