కరీంనగర్ విద్యానగర్, ఆగస్టు 2 : వైద్య రంగంలో వస్తున్న ఆధునిక వైద్య విధానాలు, సాంకేతికతను వైద్యులు ఎప్పటికప్పుడు అందించుపుచ్చుకొని మెరుగైన వైద్య సేవలు అందించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీ కిషన్ సూచించారు. కరీంనగరంలోని కొండ సత్యలక్ష్మి గార్డెన్స్‌లో ఐఎంఏ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జోన్-2 కాన్ఫరెన్స్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ (సీపీఏ) అమలులోకి వచ్చిన తర్వాత వైద్యులు-రోగుల మధ్య ఉన్న విశ్వాసపూరిత సంబంధం దెబ్బతిన్నదని, అదే వైద్యులపై దాడులు పెరగడానికి ప్రధాన కారణమైందని చెప్పారు. అన్ని ప్రైవేట్ దవాఖానల్లో ఒకే విధమైన ఫీజుల అమలు సాధ్యం కాదని స్పష్టం చేశారు.
ఆరోగ్య బీమా, సంక్షేమ పథకాలను ప్రైవేటు దవాఖానల్లోనూ అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘సంకల్ప’ పేరుతో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. అలాగే, అన్ని వైద్య విభాగాలకు చెందిన వైద్యులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాన్ఫరెన్స్ చైర్మన్ ఎంఎల్ఎన్ రెడ్డి, కో చైర్మన్లు పొలాస రామ్‌కిరణ్, పొలాస రామ్‌చరణ్, ఐఎంఏ జాతీయ యాక్షన్ కమిటీ చైర్మన్ ఈ రవీంద్రారెడ్డి, రాష్ట్ర ఎలక్టెడ్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయకుమార్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కే శ్యాంసుందర్, వైద్యులు ఎడవల్లి విజయేంద్రరెడ్డి, బీఎన్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీ అశోక్, కోశాధికారి టీ దయాల్‌సింగ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ యూ రామకృష్ణ, కరీంనగర్ ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ శైలజ, కార్యదర్శి ఎన్ మహేశ్ బాబు, కోశాధికారి నీలిమ పాల్గొన్నారు.