హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లపై కార్మికవర్గంలో ఆందోళన నెలకొన్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో శుక్రవారం బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. కార్మికులు, వివిధ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా చట్టం రూపొందించడం దురదృష్టకరమని ఆక్షేపించారు. చట్టాలను రూపొందించి ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి తీసుకు వస్తున్నామని చెప్పిన తర్వాత చర్చకు పెట్టడం, అభిప్రాయాలు చెప్పమనడం సరికాదని మండిపడ్డారు. ఈ అంశంపై బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో నిరసన గళాన్ని వినిపించారని గుర్తుచేశారు.
లేబర్కోడ్లపై తెలంగాణభవన్‌లో శనివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. అన్ని కార్మిక సంఘాలతో చర్చించి తగిన కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కొత్త లేబర్కోడ్లపై శనివారం తెలంగాణ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నామని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ ప్రకటించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారని వెల్లడించారు. రాష్ట్రంలోని ట్రేడ్ యూనియన్ల బాధ్యులు పాల్గొంటారని పేర్కొన్నారు. రౌండ్ టేబుల్ మీటింగ్‌లో కార్మిక సంఘాల అభిప్రాయాలు తీసుకొని బీఆర్ఎస్ తరఫున కేంద్రానికి పంపిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేత అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి ఉన్నారు.