RTC | హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీకి అద్దె బస్సులతో ప్రమాదం పొంచి ఉన్నదని కార్మికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక సొంత బస్సులను కొనుగోలు చేయకుండా అద్దె బస్సులను ప్రవేశపెట్టడం వారి అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. తెలంగాణ ఏర్పడినప్పుడు ఆర్టీసీకి 10,450 బస్సులు, 57,254మంది కార్మికులు ఉండేవారు. ఈ ఏడాది జూన్‌నాటికి బస్సుల సంఖ్య 9,149, సిబ్బంది సంఖ్య 40,415 మందికి పడిపోయింది. గతంలో అద్దె బస్సులు 1,431 మాత్రమే ఉండగా, ఇప్పుడవి 2,750కి పెరగడం ఆందోళనకర పరిణామమని కార్మికులు చెప్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత స్రాప్ బస్సుల స్థానంలో కొత్తవి తెచ్చారు కానీ, అదనపు బస్సులను తేలేదని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం బస్సులైన పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రవేశపెట్టకుండా యాజమాన్యం ఈవీ బస్సుల పేరిట ప్రైవేట్ ఆపరేటర్లకు అవకాశం కల్పిస్తూ సూపర్‌లగ్జరీ బస్సులను ప్రవేశపెడుతున్నదని కార్మికులు ఆరోపిస్తున్నారు.
ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్ బస్సుల పేరిట చేస్తున్న హంగామా చూస్తుంటే, సంస్థకు పొగబెట్టేలా ఉన్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆర్టీసీలో దశలవారీగా 2,400 ఈవీ బస్సులు రానున్నాయని, వీటిని అన్ని జిల్లాల్లోనూ ప్రవేశపెట్టనున్నట్టు కరీంనగర్ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. అయితే, వాటిని ప్రైవేటు ఆపరేటర్ల ద్వారానే ప్రవేశపెడతారని సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలోనే 800 ఈవీ బస్సులు వస్తున్నాయి. జిల్లాల్లో కూడా 200 బస్సులు తీసుకొస్తున్నారు. ఈవీ బస్సుల కాంట్రాక్టు విధానం బయటకు చెప్పడం లేదని, యాజమాన్యం దృష్టి ప్రైవేటీకరణ వైపే సాగుతున్నదని కార్మికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇంకా నెరవేరలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
వెయ్యి బస్సులు ఇన్.. 4వేల మంది ఔట్
ఆర్టీసీ నిబంధనల మేరకు ఒక బస్సుకు ఆరుగురు కార్మికులు సేవలు అందించాలి. ప్రైవేట్ బస్సులు పెరిగితే క్రమంగా ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని కార్మికులు చెప్తున్నారు. వెయ్యి బస్సులు ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా వస్తున్నాయంటే, రెండు వేల మంది డ్రైవర్లు, వెయ్యి మంది శ్రామిక్‌లు, మరో వెయ్యి మంది హెల్పర్లను ఆర్టీసీ కోల్పోయినట్టేనని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.