భూమిన్నోళ్లకు రైతుభోరోసా ఇత్తమంటున్నరు.. భూమిలేనోళ్లకు రూ.15వేలు సాయంజేత్తమంటున్నరు.. అయ్యా..సారు.. మాకు భూమిలేకపాయె.. బతుకని నీడలేకపాయె.. అప్పుడప్పుడు ఉపాధిహామీ పనులు జేసుకుంటం.. మా సంగతేందని నిరుపేదలు అడుగుతున్నరు.. సోనియమ్మకు జెప్పినం.. ఆ తల్లీగూడా ఆదుకోవాలని చెప్పింది.. అందుకే ప్రతి ఉపాధిహామీ కూలీకి ఏడాదికి రూ.12వేలు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ తీసుకున్నది.
రైతుకూలీలకు ఆర్థిక సాయం కోసం రూ.900 కోట్లు కేటాయిస్తున్నం. మొత్తం 15 లక్షల మందికి సాయమందిస్తాం.
భూమిలేని ఉపాధి కూలీలకు ఆర్థిక భరోసానిచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల్లో ఇచ్చినమాటకు కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నం. కుటుంబం యూనిట్‌గా స్కీంను అమలుచేస్తం. రాష్ట్రంలో మొత్తం 48,13,966 మందికి జాబ్‌కార్డులు ఉన్నాయి. ఇందులో 20 రోజులు పనిచేసినవారు 17.26 లక్షల కుటుంబాలు ఉన్నట్టు లెక్కతేలింది. వీరిలో 11 లక్షలకుపైగా కుటుంబాలు రైతుభరోసా లబ్ధిదారులు.. ఇక మిగిలిన ఆరు లక్షల మందికి ఏడాదికి రూ.12వేల చొప్పున ఇస్తం.
హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి, మంత్రుల ప్రకటనలు చూస్తే, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలుపై సర్కారు చిత్తశుద్ధేమిటో అర్థమవుతున్నది. నిరుపేదల ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వారికి మెండి‘చెయ్యి’ చూపుతున్నది. ఎన్నికల ముందు ప్రతి కూలీకి రూ.12 వేలు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి, 15 లక్షల మందికి వర్తింపజేస్తామని గత నెల 23న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. తీరా ఆరు లక్షల మందికే ఆత్మీయ భరోసా వర్తింపజేయనున్నట్టు తాజాగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. ప్రభుత్వ వైఖరిపై నిరుపేదలు భగ్గుమంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 53.6 లక్షల కుటుంబాలకు జాబ్‌కార్డులు ఉన్నాయి. వీరిలోకొందరిని వివిధ కారణాలతో తొలగించిన తర్వాత సుమారు 48,13,966 మంది మిగిలారు. ఇందులో 22.64 లక్షల మంది ఒక్కరోజూ కూడా పనిచేయలేదు. మిగిలిన 25.5 లక్షల మందికి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.12 వేల చొప్పున సుమారు రూ.3,100 కోట్లు సాయం చేయాల్సి ఉంటుంది. కానీ, సర్కారు లబ్ధిదారుల సంఖ్యను పది శాతానికి తగ్గించింది. దీంతో కంటితుడుపుగా పథకాన్ని అమలుచేయాలని నిర్ణయించినట్టు అర్థమవుతున్నది.
ఎకరం సాగుభూమి ఉన్నవారికి రైతుభరోసా కింద ఏడాదికి రూ.12వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధిహామీ కూలీల్లో ఎకరంలోపు ఉన్న సుమారు 10 లక్షల మందికి ఏడాదికి రూ.12వేలలోపే రైతుభరోసా అందనున్నది. అంటే ఉపాధికూలీలకు ఆత్మీయ భరోసా కింద ఇచ్చే నగదుకంటే వీరికి తక్కువగా ఇవ్వనున్నది. కేవలం అర ఎకరం, అంతకులోపున్న వారికి నామమాత్రంగా పెట్టుబడి సాయం అందించడం ఎంతవరకు సమంజసమని నిట్టూరుస్తున్నారు. ఎకరంలోపు ఉన్నవారిని కూడా కూలీల కింద పరిగణించాలని కోరుతున్నారు.
2023-24 సంవత్సరంలో 20 రోజులు పనికి వెళ్లినవారికే ఆత్మీయ భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నో ఏండ్ల నుంచి జాబ్‌కార్డు ఉండి, 2023-24 సంవత్సరం వరకు పనిచేసిన కూలీలను విస్మరించడంపై ఆయావర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతున్నది. ఇన్నేళ్లు పనిచేసి ఈ ఒక్క సంవత్సరం వెళ్లకుంటే అనర్హులని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమను సైతం లబ్ధిదారులుగా గుర్తించాలని కోరుతున్నారు.
జాబ్‌కార్డులు కలిగిన లక్షలాది ఉపాధిహామీ కూలీలు బతుకుదెరువు వెదుక్కుంటూ దుబాయ్, సౌదీ, ఇరాన్, ఖతార్ లాంటి దేశాలతోపాటు ముంబై, సూరత్, షోలాపూర్ లాంటి ప్రాంతాలకు వెళ్లారు. వీరు సొంతూర్లలో ఉన్నప్పుడు పనికి వెళ్లినవారే. ఇప్పుడు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినందున ఆత్మీయ భరోసా కింద సాయం చేయకపోవడంతో వీరంతా నష్టపోనున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్నారు.
ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని వందలాది పంచాయతీలను సమీపంలోని పట్టణాలు, నగరాల్లో విలీనం చేసింది. ఆయా గ్రామాల్లోని నిరుపేదలు ఇంతకాలం ఉపాధిహామీ కూలీకి వెళ్లి పొట్టపోసుకున్నారు. అయితే, ఆ గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో వారందరూ జాబ్‌కార్డులను కోల్పోనున్నారు. వీరిలో భూమిలేని అనేకమందికి కూడా రూ.12 వేలు సాయం అందదు. ప్రభుత్వం గత ఏడాదిలోని పనిదినాలను పరిగణనలోకి తీసుకోకుండా అంతకుముందు పనిచేసిన తమకు సాయం చేయాలని విజ్ఞప్తిచేస్తున్నారు.
ఎకరానికిపైగా భూమి ఉన్న అనేకమంది పేర్లను ఆత్మీయ భరోసా లబ్ధిదారుల జాబితాలో చేర్చారని తాజాగా నిర్వహించిన గ్రామసభల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చాలాచోట్ల నిరుపేద కూలీలు అధికారులను నిలదీశారు. భూమిలేని తమకు అన్యాయం చేస్తూ, భూమి ఉన్నవారికి సాయం చేయడమేమిటని ప్రశ్నించారు. పేదల ముసుగులో కాంగ్రెస్ కార్యకర్తలను లబ్ధిదారులుగా చేర్చారని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా అర్హులను గుర్తించి సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.