హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న మహిళా శంఖారావం సభ నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బూటకపు హామీలతో మహిళలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహిళా శంఖారావం సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో కలిసి బుధవారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మహిళా శంఖారావం వాల్‌పోస్టర్‌ను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. 100 రోజుల్లో హామీలు అమలుచేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు 14 నెలలైనా పట్టించుకోవడంలేదని విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వడం లేదని, ఒక్కో మహిళకు రూ.35 వేల చొప్పున రేవంత్‌రెడ్డి బాకీ పడ్డారని విమర్శించారు. రూ.35 వేలను ప్రతి మహిళకు వారి బ్యాంకు ఖాతాలో జమచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలకు భద్రత లేదని, రేవంత్‌రెడ్డి పాలనలో క్రైమ్ రేటు 20% పెరిగిందని విమర్శించారు. ఆడపిల్ల కాలేజీకి వెళ్తే ఇంటికొచ్చే వరకు భయం భయంగా ఎదురుచూసే పరిస్థితి ఏర్పడిందని, నగర శివారు ప్రాంతాల్లో దొంగలు చెలరేగుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన సీసీటీవీల్లో 70% పనిచేయడం లేదని విమర్శించారు.
భద్రత కోసం కూడా మహిళలు పోరాటం చేయాల్సి రావడం బాధాకరమని కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తంచేశారు. 18 ఏండ్లు నిండిన ఆడపిల్లలకు సూటీ ఇస్తామని రేవంత్‌రెడ్డి సర్కార్ మోసం చేసిందని విమర్శించారు. కేసీఆర్‌పై అకసుతో కేసీఆర్ కిట్లను నిలిపివేసి మానవత్వం లేకుండా సీఎం రేవంత్‌రెడ్డి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ దవాఖానలకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ దవాఖానలపై శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని బిల్డప్ ఇచ్చిన సర్కార్ మరోవైపు బస్సుల సంఖ్యను తగ్గించిందని విమర్శించారు. రైతుల డిక్లరేషన్‌తోపాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తారనే రాహుల్‌గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకొన్నారని కవిత విమర్శించారు. ఇచ్చిన మాట తప్పితే ప్రజలు ఊరుకోరనే రాహుల్ భయపడినట్టు ఉన్నారని ఎద్దువా చేశారు.
తమ అసమర్థతతో గురుకులాలను భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ సరార్.. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథక నిర్వహణను కూడా గాలికొదిలేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఘాటుగా స్పందించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు లేక భోజనం కోసం విద్యార్థులు ఎండలో కిలోమీటర్ నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తక్షణమే మధ్యాహ్న భోజన నిర్వాహకులను నియమించి విద్యార్థులకు పాఠశాల ఆవరణలోనే భోజనం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరారు.