నిర్మల్, ఫిబ్రవరి 5(నమస్తే తెలంగాణ) : ‘సార్ మీకు ఓటేసుడు సంగతి పక్కన పెట్టుండ్రి.. ముందు మాకు తాగడానికి మంచినీరు ఇవ్వండి.. నల్లాల నుంచి వచ్చే మురికి నీరు తాగి మేము, మా పిల్లలు రోగాలబారిన పడుతున్నం..’ అంటూ పలువురు మహిళలు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని నిలదీశారు. నిర్మల్ పట్టణంలోని 9వ వార్డు పరిధిలో గల బాగులవాడకాలనీలో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థికి మద్దతుగా గురువారం ఇంద్రకరణ్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరగా.. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించని హస్తం పార్టీకి ఎందుకు ఓటేయాలని కాలనీవాసులు ప్రశ్నించారు. చాలా రోజులుగా తమ కాలనీలో నల్లాల నుంచి మురికి నీరు వస్తున్నదని, అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఎవరూ పట్టించుకోవడం లేదని మహిళలు వాపోయారు. దీంతో ఐకేరెడ్డి స్పందించి అక్కడి నుంచే అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే శుభ్రమైన నీరు సరఫరా అయ్యేలా చూడాలని కోరారు.