అక్కన్నపేట, నవంబర్ 22: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం ధర్మారంలో బెల్ట్‌షాపులు మూసివేయాలని శనివారం మహిళలు ఆందోళనకు దిగారు. భర్తలు తాగి వచ్చి కొడుతున్నారని, సంసారాలు నాశనం అవుతున్నాయని పురుగు మందు డబ్బాలు పట్టుకొని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. బెల్ట్‌షాపుల నిర్వాహకుల ఇండ్లపైకి దాడికి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. గ్రామంలో మూడు బెల్ట్‌షాపులు ఉన్నాయని, మద్యం తాగివచ్చి ఇంట్లో గొడవలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కూలీ పనులతో వచ్చిన డబ్బులను బెల్ట్‌షాపుల్లోనే ఖర్చు చేస్తున్నారని వాపోయారు.
ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. బెల్ట్‌షాపులు మూసివేయకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్యలకు పాల్పడుతామని హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చారు. బెల్ట్‌షాపులు మూయిస్తామని ఎస్సై ప్రశాంత్ హామీ ఇచ్చారు. బెల్ట్‌షాపులు మూసివేయాలని కోరుతూ మహిళలు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం రాశారు.