హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ బాచుపల్లిలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో విద్యార్థిని వర్షిత ఆత్మహత్యపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. విద్యార్థుల సంక్షేమం, మానసిక ఒత్తిడి, పర్యవేక్షణ, భద్రతపై నిర్లక్ష్యం కొనసాగుతున్నట్టు గుర్తించింది. వివిధ స్థాయిల్లో అందిన ఫిర్యాదుల నేపథ్యంలో గతంలో కమిషన్ చైర్పర్సన్ నేరళ్ల శారద తనిఖీలు చేపట్టారు. కానీ పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడలేదని గుర్తించారు. దీంతో శ్రీ చైతన్య కళాశాలల చైర్‌పర్సన్‌ను ఈ నెల 10న విచారణకు రావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీచేశారు. వర్షిత ఘటనకు సంబంధించిన పరిస్థితులు, కాలేజీ యాజమాన్యం తీసుకున్న చర్యలు, తనిఖీల తర్వాత కొనసాగుతున్న నిర్లక్ష్యవైఖరి, విద్యార్థుల భద్రత, సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలపై సమగ్ర వివరాలతో హాజరుకావాలని మహిళా కమిషన్ బాధ్యులు ఆదేశించారు.