Telangana | హైదరాబాద్, నవంబర్ 3(నమస్తే తెలంగాణ): రాష్ట్రం ధర్నాలతో దద్దరిల్లుతున్నది. తెలంగాణ సమాజంలోని ఏ వర్గాన్ని తట్టినా నిరసన జ్వాలలే ఎగిసిపడుతున్నాయి. 11 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అట్టుడుకుతున్నది. పదేండ్లపాటు కేసీఆర్ పాలనలో సుభిక్షంగా ఉన్న సబ్బండవర్గాలు.. ఇప్పుడు రోడ్లెక్కి నిరసనలు తెలిపే దుస్థితికి వచ్చాయి. ప్రస్తుత తెలంగాణలో ఉద్యమకాలం నాటి పరిస్థితులు మళ్లీ దాపురించాయని రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. పాలన, ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వాధినేతలు.. విమానాల్లో చక్కర్లు కొడుతుంటే.. సమస్యల పరిష్కారానికి ప్రజలు రోడ్లమీదకు వస్తున్నారని పేర్కొంటున్నారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, పోలీసులు, హోంగార్డులు, జర్నలిస్టులు, ఆఖరికి ‘తాగునీళ్లు లేవు మొర్రో’ అంటూ ఆడబిడ్డలు కూడా ఆందోళనలకు దిగుతున్న దుస్థితి ఈ 11 నెలల్లోనే కనిపించిందని విమర్శిస్తున్నారు.
రైతు గోస పట్టని ప్రభుత్వం..
‘అదిగో ఇస్తాం.. ఇదిగో ఇస్తాం’ అని రైతు భరోసాపై ఊరించి ఉసూరుమనిపించారు. చివరికి ఈ ఏడాదికి ఇవ్వలేమని చేతులెత్తేశారు. రైతు భరోసా కోసం ఆగ్రహంతో అన్నదాతలు రోడ్లపైకి వస్తున్నారు. ఇప్పటికీ రుణమాఫీ కాని రైతులు ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీ, రైతుభరోసా పూర్తిస్థాయి అమలు కోసం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కోరుట్ల నుంచి జగిత్యాల వరకూ ఈ నెల 12న పాదయాత్ర చేసేందుకు సన్నద్ధమయ్యారు. మరోవైపు ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవటంతో అకాల వర్షాలతో కల్లాల్లో తడిసిన వడ్లను చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. తడిసిన ధాన్యాన్ని రోడ్లకి తీసుకొచ్చిన వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. ఇక పత్తి రైతులు గిట్టుబాటు ధర కోసం మార్కెట్ యార్డులు, రోడ్లపై ఆందోళన చేపడుతున్నారు. మరికొందరు కాలుష్య కారక కంపెనీల కోసం తమ భూములు గుంజుకోవద్దని భారీస్థాయిలో నిరసన తెలుపుతున్నారు.
న్యాయం కోసం రక్షకభటులూ..
పదేండ్లపాటు రాష్ర్టానికి రక్షణ కవచంలా ఉన్న పోలీసులు సైతం ప్రభుత్వ పెద్దల వింత నిర్ణయాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన 15రోజుల పనివిధానానికి స్వస్తి పలికి 26రోజుల విధానాన్ని తీసుకురావటంతో బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి భార్యలు సచివాలయం వరకూ వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని ధర్నా చేశారు. వీరిపై ప్రభుత్వం సస్పెన్షన్ల వేటు వేయడంతో ఆందోళనల పంథా మార్చారు. మరోవైపు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని హోంగార్డులు పోరుబాట పట్టారు. వారిని ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో మెరుపు ధర్నా చేపట్టారు. ఇక పెండింగ్ డీఏలు, సరెండర్ల విషయంలో సివిల్, ఏఆర్ పోలీసుల్లో వస్తున్న వ్యతిరేకతను ముందే గుర్తించి.. కొన్ని సరెండర్లకు నిధులు విడుదల చేసింది ప్రభుత్వం.
వెల్లువెత్తున్న ఆగ్రహం..
బీఆర్ఎస్ హయాంలో గురుకుల విద్యార్థులను కంటికి రెప్పల కేసీఆర్ కాపాడుకోగా.. ప్రస్తుత రేవంత్రెడ్డి సర్కార్ మాత్రం వారికి కనీస వసతులు కల్పించడంలో విఫలమైంది. తిండి సరిగా పెట్టడం లేదంటూ విద్యార్థులు భోజనం ప్లేట్లతో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. గురుకుల భవనాలకు అద్దె చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల కోసం విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎక్కడ? అంటూ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించాలంటూ చౌరస్తాల్లో ధర్నాలకు దిగుతున్నారు. మరోవైపు నిజాలు నిర్భయంగా రాస్తున్న జర్నలిస్టులను సైతం కొందరు ప్రభుత్వ పెద్దలు వేధింపులకు గురిచేస్తూ కేసులు పెడతామని బెదిరిస్తుంటే వారు సైతం ఆందోళన బాట పడుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసినా ఆయా గ్రామాల్లో ఆడబిడ్డలు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రాస్తారోకోలు చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో ఏ మూలన చూసినా ఏదో ఒక రూపంలో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు పోలీసు యాక్టుల పేరుతో ఉక్కుపాదం మోపుతూ అక్రమంగా కేసులు పెడుతుండటం గమనార్హం.