హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వాటి అమల్లో మాత్రం ప్రజలను మోసం చేస్తున్నదనే విమర్శలు ఎదుర్కొంటున్నది. అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ విజయోత్సవాలు జరుపుకొంటున్నది. అయితే, ప్రజలకిచ్చిన హామీలను ఎగ్గొట్టడంలో విజయం సాధించామని ఉత్సవాలు జరుపుకొంటున్నారా? అని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. రెండేండ్లలో ఏం సాధించారని విజయోత్సవాలు చేసుకుంటున్నారని అసహనం వ్యక్తంచేస్తున్నారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే అందజేస్తామంటూ మంత్రులు భారీ సభలు ఏర్పాటు చేసి ప్రారంభించారు. గ్యాస్ సబ్సిడీ పథకం అమల్లో ఆరంభ శూరత్వం ప్రదర్శించారు. తీరా పథకం అమలుచేసిన రెండు నెలలకే అటకెక్కించారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు పూర్తి మొత్తాన్ని వసూలు చేసి, రెండు నెలలపాటు లబ్ధిదారుల ఖాతాల్లో రూ.500 చొప్పున సబ్సిడీ డబ్బులు జమ చేశారు. గ్యాస్ సిలిండర్‌కు సబ్సిడీ అందిస్తున్నామని గొప్పలు చెప్పుకున్నారు. కానీ, లబ్ధిదారులకు మాత్రం రెండు నెలల్లోనే కుచ్చుటోపీ పెట్టారు. దశల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం తగ్గిస్తూ వచ్చారు. ఆరు నెలల్లోగా పథకం అమలును పూర్తిస్థాయిలో నిలిపేశారు.
కలెక్టరేట్, ఏజెన్సీలకు మహిళల బారులు
గ్యాస్ సబ్సిడీ డబ్బులు తమ ఖాతాల్లో జమ కావడంలేదంటూ లబ్ధిదారులు కలెక్టరేట్లకు క్యూ కడుతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో మహిళలు తమకు సబ్సిడీ డబ్బులు ఎందుకు పడటంలేదని అధికారుల వద్ద దరఖాస్తులు చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులు మాత్రం తమ చేతిలో ఏమీలేదని, ప్రభుత్వం విడుదల చేయనప్పుడు తామేం చేస్తామని చెప్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. సబ్సిడీ డబ్బులు ఎందుకు పడటంలేదో తెలుసుకునేందుకు గ్యాస్ ఏజెన్సీలకు బా రులుతీరుతున్నారు. సాంకేతిక సమస్యల వల్ల ఖాతాలో డబ్బులు జమ కావడం లేదేమో చూడాలంటూ వాకబు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోతే తామేం చేయలేమని ఏజెన్సీలు చెప్తున్నాయి. ఏజెన్సీలు తమ పరిధి కాదని చెప్తుండటంతో లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ప్రభుత్వ తీరుపై మహిళల అసహనం
మహాలక్ష్మీ పథకం పేరిట గ్యాస్ సబ్సిడీ ఇచ్చి తెలంగాణ ఆడబిడ్డలకు కానుకగా ఇస్తామని హామీ ఇచ్చి నమ్మకద్రోహం చేసిందని మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. పథకం అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడానికే కొద్దిరోజులు సబ్సిడీ ఇచ్చి మోసం చేశారని మండిపడుతున్నారు. మహిళా మంత్రులు, సీతక్క, కొండా సురేఖ ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను ఉన్నత స్థానాల్లో ఉంచుతామని చెప్పి బురిడీ కొట్టించారని చర్చించుకుంటున్నారు. ప్రారంభించిన పథకాలను నిలిపేసి విజయోత్సవాలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో ఏమీ చేయకున్నా సంబురాలు ఎలా చేసుకుంటున్నారని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా గ్యాస్ సబ్సిడీని పునరుద్ధరించి మహిళలకు ఇచ్చినమాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సాటి మహిళలుగా కొండా సురేఖ, సీతక్క ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు.