బెంగళూరు: బెంగళూరులో ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ (57)ను సైబర్ నేరగాళ్లు ఏకంగా ఆరు నెలలపాటు డిజిటల్ అరెస్ట్ చేసి, దాదాపు రూ.32 కోట్లు కాజేశారు. తమను తాము సీబీఐ అధికారులుగా చెప్పుకుని, ఆమె చేత 187 బ్యాంకు ట్రాన్స్ఫర్లు చేయించారు. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, 2024 సెప్టెంబర్‌లో ఆమెకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాను డీహెచ్ఎల్ ఎగ్జిక్యూటివ్‌నని చెప్పాడు. ఆమె పేరు మీద ఓ పార్సిల్ ముంబైలోని అంధేరీలో ఉన్న తమ కార్యాలయానికి వచ్చిందని తెలిపాడు. దానిలో మూడు క్రెడిట్ కార్డ్‌లు, నాలుగు పాస్‌పోర్టులు, నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నట్లు చెప్పాడు. దీనిపై బాధితురాలు స్పందించి, తాను బెంగళూరులో ఉంటానని, తనకు ఆ ప్యాకెట్‌కు సంబంధం లేదని చెప్పారు. ఆ కాలర్ స్పందిస్తూ, “పార్సిల్‌కు మీ ఫోన్ నంబర్ అనుసంధానం అయింది.
ఇది సైబర్ క్రైమ్ అవుతుంది” అని చెప్పాడు. అనంతరం ఆ వ్యక్తి కాల్‌ను సీబీఐ అధికారికి బదిలీ చేస్తానని చెప్పాడు. రెండో వ్యక్తి మాట్లాడుతూ, “మీకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి” అని బెదిరించాడు. “పోలీసులకు చెప్పవద్దు. మీ ఇంటిని నేరగాళ్లు నిశితంగా గమనిస్తున్నారు” అని హెచ్చరించాడు. బాధితురాలు తన కుటుంబ సభ్యుల రక్షణ, తమ కుమారునికి పెళ్లి జరగబోతుండటాన్ని గుర్తు చేసుకుని, భయపడుతూ ఆ నేరగాళ్ల ఆదేశాలను పాటించారు. మొత్తం మీద రూ.31.83 కోట్లు 187 లావాదేవీల్లో నేరగాళ్లకు పంపించారు. తనిఖీలు పూర్తయిన తర్వాత ఈ సొమ్మును 2025 ఫిబ్రవరికల్లా తిరిగి ఇచ్చేస్తామని ఆ మోసగాళ్లు పదే పదే బాధితురాలికి చెప్పారు. ఆమె కుమారునికి డిసెంబర్లో నిశ్చితార్థం జరగవలసి ఉండగా, ఆ కార్యక్రమానికి ముందే క్లియరెన్స్ లెటర్ ఇస్తామని ఆమెకు హామీ ఇచ్చారు. ఈ ఒత్తిడి, నిరంతర నిఘా వల్ల ఆమె మానసికంగా, శారీరకంగా అస్వస్థతకు గురయ్యారు.