జిల్లాలో భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రికార్డులు తారుమారు చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు పలు హైటెక్ ముఠాలు రంగంలోకి దిగుతున్నాయి. తాజాగా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలో రూ.50కోట్ల విలువచేసే భూముల రికార్డుల తారుమారుతో అమ్మేయాలని చూసిన ఓ ముఠా గుట్టును మహేశ్వరం పోలీసులు రట్టు చేశారు. ముఖ్యంగా మీసేవా కేంద్రాలు, పలువురు ఆపరేటర్ల మాయాజాలంతో రాత్రికి రాత్రే భూముల స్వరూపాన్నే మార్చేస్తున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా పట్టాలుగా ఉన్న భూములు రాత్రికి రాత్రే మరొకరి పేర్లపై బదలాయింపులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎన్ఆర్ఐలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి భూములు కొనుగోలు చేసినవారిని ఈ ముఠాలు టార్గెట్ చేస్తున్నాయి. మరోవైపు భూ భారతిలో ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న భూములను సైతం తహసీల్దార్లు, ఆర్డీవోలు ప్రతిపాదనలు పంపకుండానే నేరుగా ఈ ముఠాలు భూములకు క్లియరెన్స్ తీసుకువచ్చి స్లాట్లు బుక్చేయిస్తున్నారు. ఇలాంటి ముఠాల వలన జిల్లాలో రోజురోజుకూ భూ తగాదాలు పెరిగిపోతున్నాయి.
రంగారెడ్డి, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): జిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, బాలాపూర్, మహేశ్వరం, కందుకూరు, శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి వంటి మండలాల పరిధిలోగల భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. అలాగే, ఈ మండలాల పరిధిలోనే ఔటర్‌రింగ్‌రోడ్డు ఉండటంతో ఔటర్ చుట్టూ విల్లాలు, ఫాంహౌస్‌లు, వ్యాపార, వాణిజ్య భవనాలతోపాటు పలు ఐటీ కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. దీంతోపాటు ఫ్యూచర్‌సిటీ కూడా ఇక్కడే ఏర్పాటవుతుండటంతో ఈ ప్రాంతంలో భూముల ధరలు మరింత పెరిగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలోనే హైటెక్ ముఠాలు కూడా అదేస్థాయిలో పుట్టుకొస్తున్నాయి. కొంతమంది అధికారులు మీసేవా కేంద్రాల నిర్వాహకులు, ఆపరేటర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒక ముఠాగా ఏర్పడి వివాదాస్పద భూములను ఎంచుకుంటున్నారు. ధరణి, భూభారతిలో కూడా పెండింగ్‌లో ఉన్న రికార్డులను కూడా వీరు ఎంచుకుని ఆ భూములను కాజేసేందుకు నకిలీ ఆధార్‌కార్డులు, పాస్‌బుక్‌లను సైతం తయారుచేస్తున్నారు. దీంతో కోట్లాది రూపాయల విలువచేసే భూములను ఇప్పటికే కొంతమంది కొట్టేయగా, మరికొంతమంది కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కూడా హైటెక్ ముఠాలకు కలిసొస్తున్నది. దీంతో ఈ ముఠాలను క్షేత్రస్థాయిలో అరికట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
రూ.100 కోట్ల విలువచేసే భూమికి నకిలీ ప్రొసీడింగ్‌లు
రంగారెడ్డిజిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని బాటసింగారం గ్రామంలో సర్వే నం.376లో 223 ఎకరాల శ్రీమిత్ర డెవలపర్స్వారు భారీ వెంచర్‌ను ఏర్పాటు చేశారు. ఈ వెంచర్లో ప్రజా ప్రయోజనాల కోసం లక్ష గజాల స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుతం ఈ వెంచర్లో గజం భూమికి 20 నుంచి 30వేల వరకు ఉన్నది. ఎలాగైనా ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన స్థలాన్ని కాజేసేందుకు కొంతమంది స్థానిక నాయకులతో కలిసి ఓ బ్యాంకు ఉద్యోగి, నకిలీ ఆర్డీవో ప్రొసీడింగ్‌ను సృష్టించారు.
ఈ ప్రొసీడింగ్ ఆధారంగా లక్ష గజాల స్థలాన్ని తమ పేర్లపై అక్రమంగా బదిలీ చేయించుకున్నారు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు జరిపిన విచారణలో ఈ భూమికి సంబంధించిన ప్రొసీడింగ్ నకిలీదని, కొంతమంది నకిలీ ప్రొసీడింగ్ సృష్టించి ఈ భూములను కాజేసి ఇతరులకు విక్రయించారని గుర్తించారు. సుమారు ఈ భూముల విలువ ప్రస్తుత మార్కెట్లో రూ.100 కోట్ల వరకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
రూ.50కోట్ల విలువచేసే భూమిని కాజేసే ప్రయత్నంలో పట్టుబడ్డ ముఠా
రంగారెడ్డిజిల్లా మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు గ్రామంలో సర్వే నం.247/ఏ లో ఎల్బీనగర్కు చెందిన రామిడి యాదవ కృష్ణకాంత్రెడ్డికి 9.04 ఎకరాల భూమి ఉన్నది. ఇందుకు సంబంధించిన డిజిటల్ సంతకం పెండింగ్‌లో ఉండటంతో ల్యాండ్ రికార్డులు అప్డేటింగ్ ప్రోగ్రాంలో అప్డేట్ కాలేదు. ఈ భూమి హైదరాబాద్ శ్రీశైలం రహదారికి సమీపంలో మ్యాక్‌కు అత్యంత దగ్గరలో ఉన్నది. దీనిని ఆసరాగా చేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులైన కందుకూరు మండలం దన్నారం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌గౌడ్, దేవరకొండకు చెందిన నేనావత్ కిషన్‌నాయక్, మాడ్గుల మండలం సుద్దపల్లికి చెందిన దవలయ్యతోపాటు ఆమనగల్లులో జిరాక్స్ దుకాణం నిర్వహించే మహేశ్, కల్వకుర్తి మండలం రుక్కొండలో జిరాక్స్ షాపు నడిపే మాధవ్., ఎల్బీనగర్లో మరో జిరాక్స్ షాపు నిర్వహించే రాఘవచారి మరో ముఠాగా ఏర్పడ్డారు. వీరు నకిలీ ఆధార్‌కార్డులు, పాస్‌పుస్తకాలు తయారుచేసి భూ భారతి పోర్టల్‌లో డిజిటల్ సిగ్నేచర్ అప్డేట్ చేయించారు.
భూ భారతి పోర్టల్‌లో అప్లోడ్ చేసేందుకు స్థానిక తహసీల్దార్, ఆర్డీవోలు ప్రతిపాదనలు కూడా పంపలేదు. నేరుగా వీరు భూ భారతి పోర్టల్‌లో అప్లోడ్ చేయించారు. ఆ భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసేందుకు స్లాట్ కూడా బుక్ చేశారు. భూమి పట్టాదారు డిజిటల్ సంతకం కోసం తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించడంతో తన పాస్‌బుక్‌పై స్లాట్ బుక్కయినట్లు గుర్తించిన యాజమాని పోలీసులకు, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించగా వీరు నకిలీ పాస్‌పుస్తకాలు, ఆధార్‌కార్డులు తయారుచేసి భూభారతి పోర్టల్‌లో అప్లోడ్ చేయించడం కూడా అక్రమంగా చేపట్టినట్లు గుర్తించారు. వీరిపై గతంలోనే ఇలాంటి కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అధికారుల అప్రమత్తతో రూ.50కోట్ల విలువచేసే భూమిని కాజేసే యత్నం నుంచి కాపాడారు.

పెరుగుతున్న భూ తగాదాలు
భూ రికార్డుల తారుమారు కోసం పుట్టుకొస్తున్న హైటెక్ ముఠాలు చేస్తున్న అక్రమాలతో జిల్లాలో భూ తగాదాలు కూడా పెరిగిపోతున్నాయి. భూముల రికార్డులను తారుమారు చేసి కోట్ల రూపాయలకు విక్రయించేందుకు ముఠాలు ప్రయత్నిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఈ భూములనే నమ్ముకున్నవారు ముఠాల అక్రమాలతో నెత్తీనోరు కొట్టుకుంటున్నారు. ఇటీవల ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు, పోల్కంపల్లి, ఆదిబట్ల వంటిగ్రామాల్లో కూడా భూ రికార్డుల తారుమారు ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆదిబట్లలో కూడా శ్రీమిత్ర వెంచర్‌కు సంబంధించిన భూములకు సైతం రికార్డులు తారుమారైనట్లు అధికారులు గుర్తించడంతో ఈ భూ వివాదం ఇటీవల ఉద్రిక్తతకు దారితీసింది. సర్వేకు వెళ్లిన అధికారుల ఎదుటే రెండు వర్గాలు బాహాబాహికి దిగాయి. తుక్కుగూడ, శంషాబాద్, కందుకూరు వంటి ప్రాంతాల్లో కూడా భూ రికార్డుల తారుమారు ఉదంతాలు పెద్దఎత్తున వెలుగులోకి వస్తున్నాయి.
ఎన్ఆర్ఐలు, విదేశాల్లో స్థిరపడినవారే టార్గెట్‌గా..
భూ రికార్డుల తారుమారు ముఠాలు ఎన్ఆర్ఐ, విదేశాల్లో స్థిరపడ్డవారి భూములనే టార్గెట్‌గా చేసుకుని రికార్డుల తారుమారుకు పూనుకుంటున్నారు. ముఖ్యంగా రంగారెడ్డిజిల్లా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని పలు మండలాల్లో ఎన్ఆర్ఐలు పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేశారు. ఎన్నో ఏళ్లక్రితం కొనుగోలుచేసి వారు విదేశాల్లో స్థిరపడటంతో ఈ ముఠాలు ఆ భూములపై నకిలీ పత్రాలు సృష్టించి అమ్మకాలు జరుపుతున్నారు.వారు విదేశాల నుంచి వచ్చి చూసేసరికి ఆ ప్లాట్లల్లో ఇండ్ల నిర్మాణాలు జరిగి ఉంటున్నాయి. దీంతో వారు చేసేదేమీలేక కోర్టులు, పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కలెక్టర్ చొరవ తీసుకుని భూ రికార్డుల తారుమారు ముఠాను రట్టు చేయాలని ప్రజలు కోరుతున్నారు.