న్యూఢిల్లీ: వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎర్ర కోట వద్ద ఈ నెల 10న ఆత్మాహుతి దాడికి ముందు ఈ ఉగ్ర ముఠా భారీ ఆయుధాలతో కూడిన డ్రోన్లతో రద్దీ ప్రదేశాల్లో దాడులు చేయాలని ప్రణాళిక రచించింది. ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడి తరహాలో దాడులకు పాల్పడాలని వీరు ప్రయత్నించారు. సూసైడ్ బాంబర్, డాక్టర్ ఉమర్ ఉన్ నబీతో కలిసి పని చేసిన జసిర్ బిలాల్ వానీ వురపు డానిష్ ఈ భయానక వివరాలను వెల్లడించాడు.
ఇతనిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బృందం శ్రీనగర్‌లో అరెస్ట్ చేసింది. కారు బాంబు పేలుడుకు ముందే, డ్రోన్లకు భారీ ఆయుధాలను అమర్చి, రాకెట్లను తయారు చేసి, రద్దీ ప్రదేశాల్లో దాడులకు పాల్పడేందుకు సాంకేతిక సహకారాన్ని డానిష్ అందించాడని ఎన్ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది. సూసైడ్ బాంబర్ ఉమర్‌తో సహ కుట్రదారుగా డానిష్ పని చేసినట్లు తెలిపింది. మీడియా కథనాల ప్రకారం, పెద్ద బ్యాటరీలతో అత్యంత శక్తిమంతమైన బాంబులను తీసుకెళ్లగలిగే డ్రోన్లను తయారు చేయడానికి డానిష్ ప్రయత్నించాడు. ఆయుధాలతో కూడిన డ్రోన్లను తయారు చేయడంలో అతనికి అనుభవం ఉంది. రద్దీ ప్రదేశాల్లో డ్రోన్ల దాడి చేయాలని నిందితులు ప్రయత్నించారు.
15కు చేరిన మృతుల సంఖ్య
ఎర్ర కోట వద్ద ఈ నెల 10న జరిగిన ఆత్మాహుతి దాడిలో గాయపడిన మరో ఇద్దరు తుది శ్వాస విడిచారు. దీంతో మృతుల సంఖ్య 15కు పెరిగింది.
జావెద్ సిద్ధిఖీ సోదరుడి అరెస్టు
ఢిల్లీ ఎర్రకోట ఉగ్ర పేలుళ్ల కేసులో ఎన్ఐఏ విచారణ ఎదుర్కొంటున్న అల్ ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ జావెద్ సిద్ధిఖీ సోదరుడు హమూద్ అహ్మద్ సిద్ధిఖీని మధ్యప్రదేశ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. 25ఏండ్ల క్రితం మధ్యప్రదేశ్‌లోని మహూ ప్రాంతంలో జరిగిన ఆర్థిక మోసం కేసులో నిందితుడైన హమూద్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఒక నకిలీ ప్రైవేట్ బ్యాంకును స్థాపించిన హమూద్.. ప్రజల డబ్బును రెట్టింపు చేస్తామని వందల సంఖ్యలో డిపాజిట్లు సేకరించి మోసం చేసినట్టు అభియోగాలు ఉన్నాయి.