శేరిలింగంపల్లి, అక్టోబర్ 16: గచ్చిబౌలిలో యువతిపై లైంగికదాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆటోను గుర్తించిన పోలీసులు నిందితుడిని లింగంపల్లి గోపీనగర్లో నివాసముండే ప్రవీణ్‌గా గుర్తించారు. నిందితుడు పెట్రోల్ బంక్‌లలో జరిపిన లావాదేవీల ఆధారంగా మియాపూర్‌లో అరెస్ట్ చేశారు.
నల్లగొండ జిల్లా కేతిపల్లి మండలం కోలాపహాడ్ గ్రామానికి చెందిన జంగం ప్రవీణ్(24), నగరానికి వచ్చి గోపీనగర్లో ఉంటూ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం అర్ధరాత్రి తన ఆటో(ఏపీ23 వీ 3877) ఎక్కిన యువతి(32)పై లైంగికదాడి చేశాడు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకోవడంతో ఆమెను ఆటో నుంచి తోసి పరారయ్యాడు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని బాధితురాలిని దవాఖానకు తరలించారు.
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు మియాపూర్లోఉన్నట్లు గుర్తించి ప్రవీణ్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడికి గతంలో ఎలాంటి క్రిమినల్ హిస్టరీ లేదని, కేవలం మద్యంమత్తులో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా, బాధిత యువతి పొంతన లేని మాటలు చెబుతున్నట్టుగా తెలుస్తున్నది. తాను పనిచేస్తున్నట్టుగా చెబుతున్న అడ్రస్‌లో అసలు ఎలాంటి కార్యాలయం లేదని పోలీసులు గుర్తించారు. బాధితురాలు అర్కిటెక్ట్ అని చెప్పిన విషయం వాస్తవం కాదని తెలుస్తున్నది. దీంతో కేసును జాగ్రత్తగా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.