Konda Surekha | వరంగల్, జనవరి 6 : ‘మాకు న్యాయం చేస్తానని నమ్మించి ఓట్లు వేయించుకున్న మంత్రి సురేఖ.. ఏం న్యాయం చేయలేడందని, ఇంటికి వెళితే కుక్కలను వదిలి బయటకు తరిమేశారని’ ఓ మహిళ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
మంగళవారం తాగునీటి సమస్య పరిష్కారం కోసం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని 26వ డివిజన్ లక్ష్మీపురానికి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో ముట్టడించారు. ఈ సందర్భంగా కాలనీవాసి పోలెపాక నవమణి మాట్లాడిన మాటలను ఓ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారాయి. ఆ వీడియోలో మహిళ మాట్లాడుతూ.. ‘మొదటిసారి కొండా సురేఖ వరంగల్ తూర్పులో ఎమ్మెల్యేగా పోటీ చేసినపుడు మీ కాలనీవాసులకు న్యాయం చేస్తానని, మీ పిల్లలకు జాబులు ఇస్తామని హామీ ఇచ్చింది. గెలిచిన తర్వాత డిగ్రీలు, పీజీలు చేసిన మా పిల్లలకు ఉద్యోగాలు కావాలని ఇంటికి వెళ్లి సమస్యలు చెప్పుకుంటే.. ఓట్లు వేయడానికి రూ. 300 తీసుకున్నారుగా..
మళ్లీ ఎందుకు వచ్చారంటూ దుర్భాషలాడుతూ కుక్కలను వదిలి బయటకి తరిమేశారు. రెండోసారి గెలిచిన తర్వాత మా లక్ష్మీపురాన్ని పట్టించుకోవడంలేదు. కనీసం వరంగల్లో కూడా పర్యటించడంలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రూ.4వేలు పింఛన్ ఇస్తామని చెప్పి రెండేండ్లయినా డబ్బులు ఖాతాలో వేయడంలేదు. కేసీఆర్ హయాంలో రూ.2 వేల పింఛన్ ప్రతి నెలా బ్యాంకు ఖాతాలో పడేది. మంత్రి కొండా సురేఖ మాకు ఏం న్యాయం చేయలేదు’ అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో వెయ్యి మంది నివాసముంటున్న పేదల కాలనీలో తాగునీటి కష్టాల విషయాన్ని మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదని మహిళలు ఆరోపించారు. చెమటోడ్చి సంపాదించిన కూలి డబ్బులతో తాగునీటిని కొనుగోలు చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని అధికారులు నీటి సరఫరా పునరుద్ధరించి, సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని కోరారు.
తలాపునే నీళ్ల ట్యాంక్ ఉన్నా మా కు మాత్రం నీళ్లు వస్తలేవు. కొత్త పైపులు వేయకపోయినా పర్వాలేదు. పాత పైపుల నుం చి నీళ్లు ఇవ్వాలని అడిగినా వదులుతలేరు. తాగేందుకు బుక్కెడు నీళ్లు దొరకక నానా ఇబ్బందులు పడుతున్నం. వచ్చే ఎండాకాలాన్ని తల్చుకుంటేనే భయమైతాంది.