హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సచివాలయానికి కూతవేటు దూరంలో ఎన్టీఆర్ మార్గ్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డికి చుక్కెదురైంది..ఆయన ప్రసంగిస్తున్న సమయంలో నవనీత అనే మహిళ ధిక్కార స్వరం వినిపించింది. అన్నా అంటూ సంబోధిస్తూనే సంక్షేమ పథకాలపై ప్రశ్నించింది. గొప్పలు చెప్పుకోవడం కాదని ఇచ్చిన మాట మేరకు పింఛన్లు, రేషన్‌కార్డులు ఇవ్వాలని నిలదీసింది. అప్పుడే ఇంతకంటే పెద్ద పండుగ చేసుకుందామని తేల్చిచెప్పింది. ఆమె మా టల్లోనే.. ‘అన్నా రేవంత్ అన్నా.. ఇయ్యాల వికలాంగుల దినోత్సవం. గొప్పలు చెప్పుకోవడం ఎందుకన్న? నీకు చేతులెత్తి మొక్కుతున్న. వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళ లు, వృద్ధులకు పింఛన్లు ఇవ్వండి. అవసరమున్నోళ్లకు రేషన్ కార్డులివ్వండి. ఇదొక్కటే కోరుకుంటున్నం. జర నీకు పుణ్యముంటది. అప్పుడు ఈ ఏడాది పండుగకంటే మించి లక్షల మందితో సభ పెట్టుకుందాం’ అని చెప్పింది. ఆమె మాటలు విన్న అక్కడివారు ఆ మహిళను మెచ్చుకోవడం కనిపించిం ది. అయితే, నవనీత మాటలను సీఎం విననట్టుగానే వెళ్లిపోయారు.