మధిర, జనవరి 23 : ఓ కేసు విషయంలో తన భర్తను పోలీసులు తీసుకెళ్లడంతో మనస్తాపం చెందిన భార్య తన ఇద్దరు చిన్నారి కూతుళ్లకు ఉరివేసి, ఆపై తానూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలం నిధానపురంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. నిధానపురం గ్రామానికి చెందిన షేక్ బాజీ.. వరంగల్‌కు చెందిన ఫ్రేజా (35) ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు మెనూరుల్(7), మెహక్(5). భార్య కూలీ పనులకు వెళ్తుండగా.. షేక్ బాజీ ఆయా ప్రాంతాల్లో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ తల్లిదండ్రులు ఉంటున్న ఇంటి ఎదురుగా అద్దెకు ఉంటున్నారు.
గురువారం తెల్లవారుజామున భర్త బాజీని ఓ కేసు విషయమై ఖమ్మం పోలీసులు తీసుకెళ్లారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఫ్రేజా తన ఇద్దరు కూతుళ్లకు ఉరివేసి, ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడింది. రోజూ తమ ఇంటికి వచ్చే పిల్లలు రాకపోవడంతో షేక్‌బాజీ తల్లి అక్కడికి వెళ్లింది. తలుపులు వేసి ఉండడంతో కిటికిలోంచి చూడగా.. కోడలు ఫ్రేజా, పిల్లలు ఉరివేసుకుని విగతజీవులుగా కనిపించారు. భర్తను పోలీసులు తీసుకెళ్లారనే అవమానంతో ఫ్రేజా తన పిల్లలకు ఉరివేసి ఆత్మహత్యకు పాల్పడిందని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపించారు. మధిర రూరల్ ఎస్సై లక్ష్మీభార్గవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను మధిర ప్రభుత్వ దవాఖానకు తరలించారు.