టేకుమట్ల, సెప్టెంబర్ 17: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామానికి చెందిన రేణుకుంట్ల సారమ్మ (56) జ్వరంతో మరణించారు. సారమ్మకు శుక్రవారం జ్వరం రావడంతో పరకాలలోని ఓ దవాఖానలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉన్నదని అక్కడి వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సకాలంలో జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కేంద్రాల నిర్వహణపై ప్రభావం పడుతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమకు ఇబ్బందులెక్కువయ్యాయని వాపోతున్నారు. తమకు కూడా రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఆగస్టు వరకు ఐదు నెలలకు పైగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. ఆగస్టులో వీటిని ప్రభుత్వం చెల్లించింది. ఇక సెప్టెంబర్లో రావాల్సిన జీతాన్ని మాత్రం ఇప్పటివరకూ చెల్లించలేదు. ఇవి ఎప్పుడు వస్తాయో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ జీతాలు చెల్లించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30వేల మందికిపైగా సిబ్బంది కోరుతున్నారు.