హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. యాసంగిలో వ్యవసాయ పనులకు సరియైన నీటి వసతి లేకపోవడంతో వ్యవసాయ పనులు అంతంతమాత్రంగానే సాగాయి. దీంతో అనేక మంది ఉపాధి హామీ పనులకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఏప్రిల్, మే నెలల్లోనే 8.23 కోట్ల పనిదినాలు పూర్తి చేశారు. వాస్తవంగా కేంద్రప్రభుత్వం రాష్ర్టానికి ఈ ఆర్థిక సంవత్సరంలో 8 కోట్ల పనిదినాలను మాత్రమే మంజూరు చేసింది. ఆనాడే రాష్ట్ర ప్రభుత్వం ఈ పనిదినాలు సరిపోవని అడిగినా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. కేంద్రం కేటాయించిన పనిదినాలు పూర్తి అవడంతో రాష్ట్ర ప్రభుత్వం రాబోయే 10 నెలల కోసం మరో 8 కోట్ల పనిదినాలను మంజూరు చేయాలని కోరింది. దీనిపైనా కేంద్రం ఇంతవరకు స్పందించలేదు. రాష్ట్రంలో వ్యవసాయ పనులు సరిగా లేకపోవడం, భూగర్భ జలాలు అడుగంటడం, పనులు లేక జీవనం సాగించడానికి ఉపాధి హామీ పనుల వైపు మొగ్గు చూపారని అంచనా వేస్తున్నారు. గతంలో వేసవిలోనూ పుష్కలంగా నీరు, కరెంటు లభించడంతో వ్యవసాయ పనుల వైపే కూలీలు మొగ్గు చూపేవారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం సాగునీరు, కరెంటును సరఫరా చేయడంలో విఫలం కావడంతో అత్యధిక పనిదినాలు అయ్యాయని విశ్లేషిస్తున్నారు.