KCR | హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసంపై బీఆర్ఎస్ త్వరలోనే యుద్ధభేరి మోగించనున్నదా? తెలంగాణ ఉద్యమం తరహాలో పెను కార్యాచరణను తీసుకోనున్నదా? మోసపోయి గోసపడుతున్న తెలంగాణ ప్రజల కోసం వినూత్న పోరాట రూపాలను తీర్చిదిద్ది, కేసీఆర్ స్వయంగా ముందుండి పాల్గొననున్నారా? పార్టీలో ఇప్పుడు ఈ చర్చే జరుగుతున్నది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చిన సమయం ఇక చాలని, ఇంకా చూస్తూ కూర్చుంటే తెలంగాణ కుప్పకూలే ప్రమాదం ఉన్నదని బీఆర్ఎస్ సీనియర్లు ఇప్పటికే కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. ‘మీరు తెచ్చిన తెలంగాణ ఆగమైపోకుండా ఉండేందుకు మీరే స్వయంగా రంగంలోకి దిగాల్సిన తరుణం ఆసన్నమైంది. కాంగ్రెస్ మెడలు వంచి హామీలు అమలు చేయించాల్సిన, ప్రజలకు ఊరట కలిగించాల్సిన సమయం వచ్చింది. ఇంకా మనం మౌనం వహించడాన్ని ప్రజలు ఆమోదించడం లేదు” అని సీనియర్లు కేసీఆర్‌కు విన్నవించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఒకప్పుడు కేసీఆర్‌తో కొంత విభేదించిన పలువురు మేధావులు కూడా బహిరంగంగానే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండె, ఆయన రంగంలోకి దిగితే తప్ప కాంగ్రెస్ సర్కారు కదిలేలా దిగజార్చుతున్నారని నిప్పులు చెరుగుతున్నారు. ఇంకా మౌనంగా ఉండిపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆయన నిశ్చయానికి వచ్చారు. అలవిగాని హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను వంచించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు శూన్యహస్తం చూపిస్తూ ఉంటే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మాత్రమే కాకుండా ఈ రాష్ట్ర ఆవిర్భావానికి, అభివృద్ధికి అంకితమై పనిచేసిన బీఆర్ఎస్ చూస్తూ ఊర్కోరాదని, రాజకీయాలు, కుట్రలు, ప్రచారాలు తప్ప ప్రజలకు కించిత్ మేలు చేయని సర్కారు మీద యుద్ధభేరి మోగించబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే ఆయన మస్తిష్కంలో వెయ్యి యుద్ధాలకు సమానమైన మహోద్యమ పథక రచన జరిగినట్టేనని వారు విశ్లేషిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసంపై బీఆర్ఎస్ త్వరలోనే యుద్ధభేరి మోగించనున్నదా? తెలంగాణ ఉద్యమం తరహాలో పెను కార్యాచరణను తీసుకోనున్నదా? మోసపోయి గోసపడుతున్న తెలంగాణ ప్రజల కోసం వినూత్న పోరాట రూపాలను తీర్చిదిద్ది, కేసీఆర్ స్వయంగా ముందుండి పాల్గొననున్నారా? పార్టీలో ఇప్పుడు ఈ చర్చే జరుగుతున్నది.
ఉద్యమానికి సీనియర్ల ఒత్తిడి…
రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చిన సమయం ఇక చాలని, ఇంకా చూస్తూ కూర్చుంటే తెలంగాణ కుప్పకూలే ప్రమాదం ముంచుకొస్తున్నదని బీఆర్ఎస్ సీనియర్లు ఇప్పటికే కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. ‘మీరు తెచ్చిన తెలంగాణ ఆగమై పోకుండా ఉండేందుకు మీరే స్వయంగా రంగంలోకి దిగాల్సిన తరుణం ఆసన్నమైంది. కాంగ్రెస్ మెడలు వంచి హామీలు అమలు చేయించాల్సిన, ప్రజలకు ఊరట కలిగించాల్సిన సమయం వచ్చింది. ఇంకా మనం మౌనం వహించడాన్ని ప్రజలు ఆమోదించడం లేదు’ అని సీనియర్లు కేసీఆర్‌కు విన్నవించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
సై అంటున్న మేధావులు..
ఒకప్పుడు కేసీఆర్‌తో కొంత విభేదించిన పలువురు మేధావులు కూడా బహిరంగంగానే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండె, ఆయన రంగంలోకి దిగితే తప్ప కాంగ్రెస్ సర్కారు కదిలేలా లేదు అని టీవీ ఇంటర్వ్యూల్లో ఓపెన్‌గానే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల వాదనతో కేసీఆర్ కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. దీంతో వినాయకచవితి తర్వాత రాష్ట్రంలో రాజకీయ ధూమ్‌ధామ్ దద్దరిల్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తొమ్మిది నెలల్లో ఒక్క మంచి పని జరగకపోవడం, హామీల అమలుకు కనీస కార్యాచరణ ప్రారంభం కాకపోవడం, ప్రభుత్వంలోని పెద్దల మధ్య సమన్వయం లేకపోవడం, ప్రజల సమస్యలను పరిష్కరించే ధోరణి కనిపించకపోవడంతో సర్కారుపై ఒత్తిడి తేకపోతే, పరిస్థితి మరింత చేయిదాటిపోయే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ సీనియర్లు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల్లో నెలకొన్న నైరాశ్యం, ఆగమైపోతున్నామనే ఆందోళన, వేచిచూసినా పరిస్థితి మెరుగుపడే ఆశావహ వాతావరణం కనిపించకపోగా మరింత దిగజారుతున్న దృష్ట్యా ఇక రంగంలోకి దిగకతప్పదని బీఆర్ఎస్ సీనియర్లు కేసీఆర్‌కు చెప్పారు.
ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయించే బృహత్తర బాధ్యతను నెత్తికి ఎత్తుకోక తప్పదని కేసీఆర్‌కు వారు సూచించారు. అనేక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయని, అయితే ఆర్గనైజ్డ్ నాయకత్వం లేని కారణంగా ప్రభుత్వం మీద ఆయా వర్గాలు తగినంత ఒత్తిడి తేలేకపోతున్నాయని కేసీఆర్ దృష్టికి వారు తీసుకొచ్చారు. మోసం చేసిన కాంగ్రెస్‌పై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, వారికి నాయకత్వాన్ని అందించే బాధ్యత తీసుకోవాలని కేసీఆర్‌కు సూచించారు. పార్టీ కీలక నేతలు, వివిధ వర్గాల ప్రముఖుల నుంచి వస్తున్న వినతుల నేపథ్యంలో సెప్టెంబరు 10 నుంచి బీఆర్ఎస్ పోరాట కార్యాచరణకు సన్నాహాలు మొదలుపెట్టనున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా పార్టీ కార్యవర్గాన్ని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ప్రజా ప్రతినిధులతో విసృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఆరు గ్యారెంటీలూ అమలు చేయాల్సిందే!
అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారంలోకి రావటం కోసం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, బేషరతుగా, ఎలాంటి ఆంక్షలు లేని అనేక హామీలు ఇచ్చాయి. బీఆర్ఎస్ నుంచి వచ్చిన దానికన్నా, నాలుగు పైసలు ఎక్కువ వస్తాయన్న ఆశతో అదనంగా రెండు శాతం కంటే లోపు ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ మొండిచెయ్యి చూపింది. మెల్లమెల్లగా గ్యారెంటీల ప్రస్తావన ఎత్తడమే మానేసింది. దానిస్థానంలో చవకబారు మాటలు, విమర్శలు చేసి ప్రజలతో డైవర్షన్ గేమ్ ప్రారంభించింది. అమలుచేసిన ఒకటి రెండింటికి కూడా పలు ఆంక్షలు, షరతులు, నిబంధనలు విధిస్తూ లబ్ధిదారుల సంఖ్యను కుదిస్తున్నది. మొదలేపెట్టని గ్యారెంటీలను కూడా అన్నీ అమలైపోతున్నయ్ అంటూ మంత్రులు చేస్తున్న ప్రకటనలు, వాటిని అమలు చేసే ఉద్దేశం లేకపోగా దబాయింపులు ఎక్కువయ్యాయి. నిబంధనల సాకుతో హామీలను ఎగబెట్టాలె అన్నదే కాంగ్రెస్ విధానంగా కనిపిస్తున్నది. ఏ రంగాన్ని తీసుకున్నా ఇదే పరిస్థితి. అమలు చేయలేమని తెలిసి కూడా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇచ్చిందనీ, అందువల్ల వాటిని అమలు చేయించక తప్పదనీ బీఆర్ఎస్ ముఖ్యుల అభిప్రాయపడుతున్నారు. ‘1956లో ఆంధ్రాతో విలీనానికి ముందు తెలంగాణ హక్కులు కాపాడుతామని కాంగ్రెస్ నేతలు అనేకసార్లు హామీలిచ్చారు. తర్వాత మాట తప్పారు. తెలంగాణ రాష్ట్రం కావాలని తొలి, మలి ఉద్యమాలు జరిగినప్పుడు రాష్ట్రం ఇస్తామని అనేకసార్లు హామీలిచ్చారు. తర్వాత గట్టునపెట్టారు. కానీ ఇప్పుడు అట్లా నడిచే పరిస్థితి ఉండదు. ఇది పాత తెలంగాణ కాదు. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్‌కు తప్పించుకునే చాన్స్ ఇచ్చే ప్రసక్తే తలెత్తదు’ అని పార్టీ ముఖ్యనేత ఒకరు పేర్కొన్నారు.
ధ్వంసమైన వ్యవసాయరంగం
కేసీఆర్ హయాంలో ఉజ్వలంగా వెలిగిన వ్యవసాయ రంగం ఏదో శాపం తలిగినట్టు, 8 నెలల్లోనే కుదేలై కూర్చున్నది. రైతుబంధు ఇవ్వకుండా, రైతు భరోసాను అమలు చేయకుండా కాంగ్రెస్ తమను నిలువునా ముంచిందన్న భావన రైతుల్లో బలంగా నెలకొన్నది. ఎరువులు, విత్తనాల కొరత, కరెంటు ఇబ్బందులు! ఇక అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్, చివరికి వరికి మాత్రమే అని ముక్కువిరిచి, దాన్లోనూ సన్నాలకు మాత్రమే ఇస్తామని మాట్లాడి, చివరికి నాలుగైదు వెరైటీలకే బోనస్ వర్తింపజేసిన తీరు రైతాంగాన్ని నివ్వెరపరిచింది. యాసంగి కొనుగోళ్లను గమనిస్తే, పండించిన ధాన్యమన్నా కొంటారో లేదో తెల్వని పరిస్థితి. ఇక ప్రభుత్వం చెప్తున్న రుణమాఫీ సగం మంది రైతులకు కూడా వర్తించలేదు. రైతులు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ఆందోళనకు దిగుతున్నారు. బ్యాంకుల చుట్టూ, ఏఈవోల చుట్టూ తిరుగుతున్నారు. అనేకచోట్ల ఆందోళన చేస్తున్న రైతాంగానికి బీఆర్ఎస్ అండగా నిలిచినా, రైతాంగం అనార్గనైజ్డ్గా ఉండటం వల్ల ఎవరికివారే మదనపడుతున్నారు. రుణమాఫీ పరిణామాల నేపథ్యంలో రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదు.
పైపెచ్చు కాంగ్రెస్ సర్కార్ చేసిన రుణమాఫీ పూర్తి కాకపోవడంతో పాత అప్పు కడితేనే కొత్త అప్పు ఇస్తామని తెగేసి చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను రైతులు ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన వడ్డీ వ్యాపారులు రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని వడ్డీరేట్లను ఇబ్బడిముబ్బడిగా పెంచేస్తున్నారు. ఇక ఎరువులు, విత్తనాల కోసం పల్లెల్లో చెప్పులు, సంచులను క్యూలైన్లో పెట్టే దృశ్యాలు, తోపులాటలు, ఎరువుల దుకాణాలు, బ్యాంకుల్లో పోలీసుల పహారా తెలంగాణలో వ్యవసాయ రంగంలో నెలకొన్న దయనీయ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. రాజకీయ కక్షతో కాళేశ్వరాన్ని ఎండబెట్టడంతో అనేక జిల్లాల్లో సాగునీటి సంక్షోభం ఏర్పడింది. చివరికి రైతులే కార్లు వేసుకుని, శ్రీరాంసాగర్ వద్దకు వచ్చి నీళ్లు వస్తాయా లేవా అని తెలుసుకోవాల్సిన దుస్థితి. కేసీఆర్ పాలనలో నెలకొన్న పండుగను రేవంత్సర్కార్ పడావు పెట్టిందనే ఆందోళన నెలకొన్నది. ఇలా ఎటు చూసినా దిక్కుతోచని స్థితితో రాష్ట్ర రైతాంగం తీవ్ర నిరాశ, నిస్పృహల్లోకి వెళ్లింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రైతుకు భరోసా కల్పించి వారి మానసిక ైస్థెర్యాన్ని నిలబెట్టడం కేసీఆర్‌కు మినహా మరెవరికీ సాధ్యం కాదని బీఆర్ఎస్ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.
ఆడబిడ్డలకు మోసం
ఎన్నికలకు ముందు తెలంగాణ మహిళాలోకానికి రేవంత్ అరచేతిలో స్వర్గం చూపించారు. అధికారంలోకి వచ్చాక, ఉచిత ప్రయాణం కల్పించామని, దీంతో మహిళాలకు తాము ఇచ్చిన అన్ని హామీలు అమలయ్యాయన్న రీతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది. కల్యాణలక్ష్మి కథ వొడవని ముచ్చటగా మారింది. ఆడబిడ్డ పెండ్లికి తులం బంగారం అని ఇచ్చిన హామీ ఎటుపోయిందో ఎవరికీ తెలియదు. గృహిణులకు నెలనెలా రూ.2,500 ఊసే లేదు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఎవరికి అందుతున్నదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది. గృహలక్ష్మి ఎవరిని కరుణిస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు.
సంక్షేమం సదా విస్మరణ
కాంగ్రెస్ సర్కార్ సంక్షేమం సదా విస్మరణగా మారిపోయింది. కేసీఆర్ సర్కార్ ప్రారంభించిన రూ.10 లక్షల దళితబంధును తాము అధికారంలోకి వస్తే రూ.12 లక్షలకు పెంచుతాం అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టింది. ఊరూరా దండోరా వేసింది. ఓట్లు దండుకున్న తెల్లారే దళితబంధుకు రాంరాం చెప్పింది. గిరిజనబంధుకు ఎగనామం పెట్టింది. కొత్తవి ఇవ్వకపోగా పాతపథకాన్ని కూడా అమలు చేయటంలేదు. కేవలం 9 నెలల్లో రేవంత్ సర్కారు ఏకంగా 65 వేల రూ.కోట్ల అప్పు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు ప్రపంచబ్యాంకు అప్పులు తెచ్చే పనిలో పడ్డారు.
ఇంకా వేచిచూస్తే విధ్వంసమే…
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 9 నెలలు పూర్తి కావస్తున్నది. సర్కారు కుదురుకునే దాకా తగినంత సమయం ఇవ్వాలని కేసీఆర్ మొదటి నుంచీ చెప్తూ వస్తున్నారు. అందుకే ఇప్పటిదాకా వేచిచూసే ధోరణిని బీఆర్ఎస్ అవలంబించింది. అయితే ఇక కదనభేరి మోగించకతప్పదని పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. బీఆర్ఎస్ పార్టీ రైతు, మహిళా, విద్యార్థి, ఎస్సీ, ఎస్టీ, యువత, మైనారిటీ ఇలా అన్ని విభాగాలు ఎక్కడికక్కడ క్షేత్రంలోకి దిగి ‘ఏం చేస్తే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నుంచి బయటపడ్తాం’ అనే కోణంలో సెప్టెంబరు 10 తర్వాత సమాలోచనలు చేపట్టనున్నది. పార్టీ ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, జిల్లా అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాలు, మండల, గ్రామ.. ఇలా అన్నిస్థాయిల పార్టీ క్యాడర్‌తో సమాలోచనలు జరిపి ఉమ్మడి ఉద్యమ కార్యాచరణను చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వివరించాయి. కూల్చుడు తప్ప కట్టుడు తెలియని కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయించేదాకా, చేయకపోతే గద్దె దించేదాకా అవిశ్రాంత ప్రజాపోరుకు గులాబీ శ్రేణులు సిద్ధం అవుతున్న స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.
నిరుద్యోగులు భగభగ
కాంగ్రెస్ తమను ఆగం చేసింది అని నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమను ఏదో ఉద్ధరిస్తుందనుకున్న నిరుద్యోగుల భ్రమ లు పటాపంచలు కావడానికి ఎక్కువ సమ యం పట్టలేదు. కేసీఆర్ హయాంలో జరిగిన ఉద్యోగ ప్రక్రియకు నియామక పత్రాలు చేతిలో పెట్టి తమ ఘనతగా కాంగ్రెస్ ప్రచారం చేసుకున్నప్పుడే నిరుద్యోగుల్లో అనుమానాలు తలెత్తాయి. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలు అ అనుమానాలను నిజం చేశాయి. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్న ఆశలు ఆవిరయ్యాయి. కేసీఆర్ హయాంలో వెనకుండి నడిపించిన మేధావులు తమ పదవులు తాము చూసుకుంటూ ఉంటే మోసపోయిన నిరుద్యోగులు నెత్తిన చేతులు పెట్టుకుంటున్నారు. రెండు లక్షల ఉద్యోగాలు పోయాయి. జాబ్ క్యాలెండర్లో తేదీల క్యాలెండర్ మాత్రమే చేతికి వచ్చిం ది. జాబ్‌లు గాల్లో కలిసిపోయాయి. కనీసం నిరుద్యోగుల చిరు డిమాండ్లు 1:100 వంటి వాటిని కూడా పట్టించుకున్న వాడు లేడు. ఎగేసినోడు అందలం మీద కూర్చున్నాడు. నిరుద్యోగులు రోడ్ల మీద పడ్డారు.
ఒక్కరోజే ఎన్ని సమస్యలో…
కుటుంబం సాకుగా రుణమాఫీ చేయకపోవడాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా వెల్లుల్లలో చెవిలో పూలతో కుటుంబ ధ్రువీకరణ పత్రాన్ని అధికారులకు అందజేస్తున్న రైతు మారు మురళీధర్‌రెడ్డి
గృహజ్యోతికి బిల్లుల మోత
అన్ని అర్హతలున్నా, గృహజ్యోతికి దరఖాస్తు చేసుకున్నా ఆరునెలలుగా కరెంటు బిల్లులు వస్తూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు జగిత్యాల పట్టణానికి చెందిన బీడీ కార్మికురాలు ఎనగంటి మౌనిక. ఇప్పుడు ఆరు నెలల కరెంట్ బిల్లులు ఒక్కసారే కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు.
ఎరువుల కోసం బారులు
యూరియా కోసం అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద 40 గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం యూరియా కూపన్ల కోసం ఇలా బారులు తీరారు. రోజంతా క్యూలో నిలబడితే ఆధార్ కార్డుకు 5 యూరియా బస్తాలే ఇస్తున్నారని వారు వాపోయారు.
వసతిగృహంలో పురుగుల అన్నం
రంగారెడ్డి జిల్లా పాలమాకుల కస్తూర్బా గాంధీ హాస్టల్ విద్యార్థులు శుక్రవారం రోడ్డెక్కారు. ‘పురుగుల అన్నం పెడుతున్నరు. అడిగితే కొడుతున్నరు’ అని విద్యార్థులు వాపోయారు.
వానకాలం వరి కూడా ఎండిపాయె!
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో కరువు ఛాయలు నెలకొన్నాయి. ఎస్పారెస్పీ కాలువల ద్వారా ప్రభుత్వం చెరువులు నింపకపోవడంతో ఎండిన వరి పైరును చూపుతున్న మర్రికుంటతండా రైతు బానోతు యాకూబ్.
పేదల బస్తీపైకి రేవంత్ బుల్డోజర్
ఓవైపు అధికారపార్టీ నేతలకు నోటీసులతో సరిపెడ్తున్న హైడ్రా పేదల ఇండ్లపైకి మాత్రం బుల్డోజర్లను తోలుతున్నది.శుక్రవారం హైదరాబాద్ లోని రాంనగర్ మణెమ్మ బస్తీపైకి బుల్డోజర్లు విరుచుకు పడ్డాయి. ఆక్రమణల సాకు చూపి నివాసాలను కూల్చివేశాయి.
పోరుబాటలో రైతన్న పాదయాత్ర
రుణమాఫీ పేరుతో తమకు జరిగిన అన్యాయంపై ఆదిలాబాద్ రైతులు పోరుబాట పట్టారు. తాంసి మండలం కప్పర్ల నుంచి పాదయాత్ర చేపట్టిన రైతులు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు.