హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ‘పురపోరు’లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం గా జిల్లాలవారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో కేటీఆర్ వరుసగా మున్సిపాలిటీల వారీగా నేతలతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే వరంగల్, కరీంనగర్ జిల్లాల నేతలతో సమావేశమైన ఆయన.. శనివారం ఖమ్మం, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నేతలతో భేటీ కానున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమావేశంలో జిల్లా అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
శుక్రవారం కరీంనగర్ జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా రెండున్నర దశాబ్దాలుగా బీఆర్ఎస్కు అండగా నిలుస్తూ పార్టీకి కంచుకోటలా మారిందని కొనియాడారు. ప్రతి వార్డు, డివిజన్ స్థాయిలో ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయని స్థానిక నేతలు కేటీఆర్‌కు వివరించారు. ప్రతి మున్సిపాలిటీని ఒక యూనిట్‌గా తీసుకొని, అకడి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు రచించాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన పట్టణ అభివృద్ధిని వివరించాలని సూచించారు. రెండేండ్ల కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలే అస్ర్తాలుగా ప్రచారం చేపట్టాలని చెప్పారు. గత రెండేండ్ల్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణాల్లో ఒక రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. గ్రామీణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పాలనను తిరసరించారని, ఇదే ధోరణి పట్టణాల్లోనూ కనిపిస్తున్నదని తెలిపారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించాలని పిలుపునిచ్చారు.
ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, అడ్డదారులు తొకినా 4000 పైచిలుకు గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలవడం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి స్పష్టమైన సంకేతమని కేటీఆర్ చెప్పారు. 24 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని, అన్ని రంగాల్లో కుప్పకూలిన పరిపాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానీకం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. రేవంత్ చేతకాని పాలనతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారని చెప్పడానికి ఈ ఫలితాలే ప్రత్యక్ష సాక్ష్యమని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంతకన్నా పెద్ద ఎదురుదెబ్బ తప్పదని స్పష్టంచేశారు. కేవలం రెండేండ్లలోనే అధికార పక్షంపైన ఇంత తీవ్రమైన వ్యతిరేకత రావడం ఎప్పుడూ చూడలేదని అన్నారు. అసెంబ్లీ ఫలితాల అనంతరం మన పార్టీ అనేక సవాళ్లను ఎదురొని, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని దాటుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరంతర పోరాటం చేస్తూ మరోసారి ప్రజల మనసును చూరగొన్నదని వివరించారు. కాంగ్రెస్ పార్టీ పాలనతో విసిగిపోయిన ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని చెప్పారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికలకు సర్వసన్నద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులంతా శక్తి వంచన లేకుండా గులాబీజెండాకు పూర్వ వైభవం తెచ్చేందుకు సరిహద్దుల్లో సైనికుల్లాగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణాల్లో కొత్తగా ఒక రూపాయి కూడా ఖర్చు చేయలేదని, మున్సిపాలిటీలు సమస్యలకు కేరాఫ్‌గా మారాయని విమర్శించారు.