YTPP | దామరచర్ల, ఆగస్టు 1 : ఉమ్మడి పాలనలో తెలంగాణపై కమ్ముకున్న చీకట్లను పారదోలేందుకు నాటి ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనో ఫలకం నుంచి పుట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ‘వెలుగులు’ విరజిమ్ముతున్నది. తెలంగాణలో విద్యుత్తు సంక్షోభాన్ని రూపుమాపేందుకు ‘దార్శనికుడు’ చేపట్టిన ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అన్నదాతలకు పూర్తిస్థాయిలో విద్యుత్తు సరఫరా చేయడమే కాకుండా తెలంగాణను విద్యుత్తు మిగులు రాష్ట్రంగా నిలపాలన్న కేసీఆర్ కల సాకారమైంది. బీఆర్ఎస్ హయాంలో నాటి సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా యాదాద్రి భువనగిరి జిల్లా దామరచర్ల మండలంలో రూ. 25 వేల కోట్లతో 5 యూనిట్లతో 4వేల మెగావాట్ల పవర్ ప్లాంటుకు 2015 జూన్ 8న టీఎస్ జెన్కో ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. కేసీఆర్ మానసపుత్రిగా పేర్కొన్న ఈ పవర్ ప్లాంట్ పనులను బీహెచ్ఈఎల్కు అప్పగించారు. అన్ని అనుమతులతో 2017 అక్టోబర్‌లో 5 ప్లాంట్ల పనులను ప్రారంభించారు.
మొదట్లో పనులు వేగంగా కొనసాగినా కరోనా కారణంగా ఇతర రాష్ర్టాల కార్మికులు స్వస్థలాలకు వెళ్లడంతో కొంత జాప్యం కలిగింది. కరోనా తర్వాత పనులు చకచకా కొనసాగడంతో రిజర్వాయర్లు, బాయిలర్లు, కూలింగ్ టవర్లు, సబ్స్టేషన్ల పనులన్నీ పూర్తయ్యాయి. దీంతో పాటు రూ.100 కోట్లతో 8 కిలోమీటర్ల పరిధిలో రైల్వేలైన్ల పనులూ కంప్లీట్ అయ్యాయి. పవర్‌ప్లాంటు పనులను కేసీఆర్ నిత్యం పర్యవేక్షిస్తూ త్వరగా పూర్తయ్యేలా అధికారులను సమన్వయం చేశారు. మూడు సార్లు పవర్ ప్లాంట్ పనులను స్వయంగా పరిశీలించారు. ప్లాంటు మొదటి, రెండో యూనిట్ల పనులు 90 శాతం పూర్తి చేయించారు. మిగతా యూనిట్ల పనులు కూడా 70 శాతం పూర్తయిన సమయంలో చెన్నై, ముంబయికి చెందిన సామాజిక వేత్తలు ఎన్జీటీలో కేసు వేయడంతో విద్యుత్తు ఉత్పత్తికి బ్రేక్ పడింది.
ఇంతలో ఎన్నికలు జరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం మొదట రెండో యూనిట్‌ను ప్రారంభించి 800 మెగావాట్ల విద్యుత్తును ప్రారంభించింది. శుక్రవారం మొదటి యూనిట్‌ను కూడా ప్రారంభించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ముగ్గురు మంత్రులు కలిసి ప్లాంటును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. నాడు సీఎం కేసీఆర్ చూపిన దార్శనికత కారణంగా నేడు రాష్ర్టానికి 1600 యూనిట్ల విద్యుత్తు అందనున్నది. రానున్న రోజుల్లో విద్యుత్తు కొరతను అధిగమించేందుకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు విద్యుత్తు ఉత్పత్తే ఆధారం కానున్నది. నాడు రూ.25వేల కోట్లతో ప్రారంభించిన ప్లాంట్ ప్రస్తుత వ్యయం 36 వేల కోట్లకు చేరింది.
అవరోధాలను అధిగమించి..
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే విద్యుత్తు రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. కృష్ణా, మూసీ నదుల తీరంలో ఉన్న దామరచర్ల మండలంలో యాదాద్రి వపర్ ప్లాంటుకు శ్రీకారం చుట్టారు. 25 వేల కోట్లతో 4 వేల మెగావాట్ల పవర్ ప్లాంటుకు 2015లో శంకుస్థాపన చేశారు. భూసేకరణలో అనేక ఆటంకాలు ఎదురైనా చాకచక్యంగా పరిష్కరించారు. ప్లాంటు కింద 5,668 ఎకరాల భూమిని సేకరించగా, అందులో 4,676 ఎకరాలు అటవీశాఖ భూమి ఉన్నది. 702 ఎకరాల్లో ఎంక్రోచర్లు సాగుచేసుకుంటుండగా వారికి మానవతా దృక్పథంతో ఆరు లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేశారు. ప్లాంటు కింద నష్టపోయిన రెండు తండాలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందజేశారు. 550 మంది భూ నిర్వాసితులను గుర్తించి పరిహారం ఇచ్చారు. ఆ సమయంలో కేసీఆర్ తాను కూడా భూ నిర్వాసితుడినేనని, వారి బాధలు తనకు తెలుసునంటూ ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తానని చెప్పి, అందరినీ ఒప్పించి ప్లాంటు పనులు ప్రారంభించి పూర్తిచేశారు. నాడు కేసీఆర్ ముందుచూపుతో శ్రీకారం చుట్టి, ప్రారంభించిన వెలుగు జిలుగుల ప్రాజెక్టు నేడు జాతికి అంకితమై విద్యుత్తు ఉత్పత్తికి సిద్ధమైంది.