వరంగల్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీకి తాజా సర్పంచ్‌లు షాక్ ఇస్తున్నరు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ప్రత్యేకించి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుతో విసుగుచెందుతున్న సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఆ పార్టీ వీడి బీఆర్ఎస్కు క్యూ కడుతున్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి వందలాది మంది కాంగ్రెస్ ముఖ్యనాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డుసభ్యులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. సాధారణంగా సొంత సత్తాతో గెలిచిన ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల మద్దతుతో గెలిచినవారు అధికార పార్టీలో చేరడం ఆనవాయితీ కాగా రాష్ట్రంలో అందుకు భిన్నమైన వాతావరణం నెలకొన్నది. మంత్రులు, ఎమ్మెల్యేల ఒంటెత్తు పోకడలతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెలను నిర్వీర్యం చేస్తున్నదని, బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పాలనలోనే గ్రామాలు అన్ని విధాలా అభివృద్ధి చెందాయని చేరికల సందర్భంగా పలువురు సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు పేర్కొంటున్నారు.
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం మేడారం తండా సర్పంచ్ భూక్యా సరితాచిరంజీవి జడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత సమక్షంలో బీఆర్ఎస్లో చేరడం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం ఉపసర్పంచ్ బెజగం మహేశ్‌తోపాటు పలువురు వార్డు సభ్యులు నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు సమక్షంలో కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరడం వంటి పరిణామాలతో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు తిరోగమన వాతావరణం నెలకొన్నదని స్పష్టమవుతున్నది. దాన్ని గ్రహిం చే రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహిస్తులేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పునాదుల్లేని కాంగ్రె స్ చేరికలను ప్రోత్సహించేందుకు ఎత్తుగడ వేసింది. భారీ ఎత్తున నజరానాలను ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులే కా కుండా గ్రామాల్లో పలుకుబడి ఉన్న క్యాడర్ ను కలుపుకోవాలని పథక రచనచేసి మం త్రులు, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపింది. చిన్నస్థాయి గ్రామ పంచాయతీలకు రూ. 5 లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీలకు రూ. 10 లక్షలతోపాటు నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి ఆ గ్రామ స్వరూపాన్నిబట్టి కేటాయిస్తామని ఆఫర్పెట్టింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు కాదు కదా, కనీసం ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల నుంచి గెలిచిన వార్డు మెంబర్లు కూడా కాంగ్రెస్ పార్టీ నేతల మొహంమీద ‘నో’ అంటున్నారని స్వయంగా ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు.