హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ ) : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన కృషి, అనుసరించిన విధానాల ఫలితంగానే ఎలక్ట్రిక్ వాహన దిగ్గజ కంపెనీ బీవైడీ తెలంగాణకు వస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు బీవైడీ అంగీకరించిందని గుర్తుచేశారు. ఇప్పుడు భారీ పెట్టుబడితో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు బీవైడీ సంస్థ ముందుకు రావడంపై సంతోషం వ్యక్తంచేస్తూ శుక్రవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సుమారు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి తెలంగాణలో పెట్టాలని బీవైడీ సంస్థతో 2022-23లో పలుమార్లు చర్చలు జరిపామని తెలిపారు. అయితే, ఇటీవల భారత ప్రభుత్వం సరళీకృత విధానాన్ని అనుసరించడంతో ఈ పెట్టుబడి తిరిగి తెలంగాణకు రావడం హర్షణీయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఫార్ములా-ఈ రేస్‌పై చేస్తున్న విమర్శలను కేటీఆర్ ప్రస్తావించారు. ఫార్ములా-ఈ రేస్‌ను కేవలం రేస్గానే చూడకూడదని, తెలంగాణ మొబిలిటీవ్యాలీ కార్యక్రమంలో భాగంగా సమగ్ర ప్రణాళికతో దీనిని నిర్వహించామని వివరించారు. దేశ ఎలక్ట్రిక్ వాహన రంగంలో తెలంగాణను కేంద్ర స్థానంగా మార్చాలనే లక్ష్యంతో అనేక అంశాలతో కూడిన, పకా ప్రణాళిక ప్రకారం పనిచేశామని తెలిపారు. అందులో భాగంగానే వినూత్నమైన ఈవీ పాలసీ, ఈవీ సమ్మిట్, తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు, ఫార్ములా-ఈ నిర్వహణ వంటి అనేక కార్యక్రమాలను చేపట్టామని పేర్కొన్నారు. గతంలో ఈవీ విధానాన్ని తీసుకొచ్చి, ఎలక్ట్రిక్ వాహన రంగంతోపాటు వాటి అనుబంధ రంగాల్లో కూడా పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో ఫార్ములా-ఈ రేస్‌ను నిర్వహించామని, దాని ఫలితమే ఈ బీవైడీ పెట్టుబడి అని తెలియజేశారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో సౌ‘భాగ్యనగరం’గా మారితే, 15 నెలల అసమర్థ కాంగ్రెస్ పాలనలో అది అ‘భాగ్యనగరం’గా తయారైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో హైదరాబాద్‌లో ఇండ్ల కొనుగోళ్లు బాగా తగ్గాయని దుయ్యబట్టారు. పేదల ఇండ్ల మీదకు బుల్డోజర్లను పంపి, పెద్దల ఆస్తులతో సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని మండిపడ్డారు. మూసీ, హైడ్రా పేరుతో కాంగ్రెస్ గద్దలు మూటలు కడుతున్నారని, అమ్మకాలు జరుగక రియల్టర్లు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే, అన్నదాతల మాదరిగానే అమాయక రియల్ఎస్టేట్ వ్యాపారులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో గత త్రైమాసికంలో ఇండ్ల విక్రయాలు 49%, ఆఫీస్ లీజ్ 41 శాతానికి పడిపోయిందని వివరించారు. ఇలాంటి పరిస్థితులతో రియల్ఎస్టేట్ ఢమాలైందని, ఇన్ఫ్రా రంగం సజీవ సమాధి అయిందని విమర్శించారు. ‘కూల్చడం కాదు.. కట్టడం నేర్చుకోవాలి. అబద్ధాలు చెప్పడం కాదు.. అభివృద్ధి చేయడం నేర్చుకోవాలి’ అని ఎక్స్ వేదికగా హితవు పలికారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక సదస్సుకు హాజరుకావాలంటూ ఆహ్వానం అందింది. బ్రిటన్‌లో జరిగే ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సుకి రావాలంటూ బ్రిడ్జ్ ఇండియా సంస్థ ప్రత్యేకంగా కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఈ ఏడాది మే 30న లండన్‌లోని రాయల్ లాంకాస్టర్ హోటల్లో జరిగే సదస్సుకు కేటీఆర్‌ను ముఖ్య వక్తగా ఆహ్వానిస్తూ, బ్రిడ్జ్ ఇండియా వ్యవస్థాపకుడు ప్రతీక్ దత్తాని లేఖ పంపారు. 2023లో ఇదే కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న కేటీఆర్.. ఆనాడు చేసిన ప్రసంగం, ఆలోచనలు అక్కడి వారందరినీ ఆకట్టుకున్నాయని ఈ సందర్భంగా ప్రతీక్ తెలిపారు. ఈసారి కూడా లండన్ వ్యాపారవర్గాలు, ఇండో-యూకే కారిడార్‌లోని ముఖ్య వ్యక్తులు, తెలుగు ప్రవాసులు కేటీఆర్ ప్రసంగం వినడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. దీంతో తెలంగాణలో ప్రభుత్వం మారినప్పటికీ, కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామని వివరించారు. ఈ సదస్సుకి భారత్-బ్రిటన్ వ్యాపార ప్రముఖులు, పాలసీ మేకర్లు, తెలుగు ప్రవాసులు.. 900 మందికిపైగా హాజరవుతారు. ఈ వేదికలో భారత ఆర్థిక ప్రగతి, విదేశీ పెట్టుబడుల అవకాశాలు, వాణిజ్య సంబంధాల పురోగతిపై చర్చించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ బ్రిటన్ పారిశ్రామికవేతలు, తెలుగు ప్రవాసులతో సమావేశం కానున్నారు.