హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : ప్రారంభమైన నిమిషంలోనే శాసనసభను వాయిదా వేయడం సభకు తీరని అవమానమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. మునుపెన్నడూ లేని విధంగా ఒక్కమాట కూడా మాట్లాడకుండా వాయిదా వేసిన ప్రభుత్వ చర్యతో శాసనసభతోపాటు రాష్ట్రం పరువు పోయిందని విమర్శించారు. మంగళవారం శాసనసభ వాయిదా అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, కేపీ వివేకానందగౌడ్, విజయుడు, డాక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడారు. సభా నిబంధనలను తుంగలో తొక్కారని, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఇలా జరుగలేదని వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. క్యాబినెట్ మీటింగ్ పూర్తి కాలేదని సభను వాయిదా వేస్తారా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రశ్నించారు. సభ్యులను 11 గంటలకు రావాలని చెప్పి వాయిదా ఎలా వేస్తారని నిలదీశారు. ‘క్యాబినెట్ చర్చ లేకుండా, అప్రూవల్ లేకుండా ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. కులగణన శాస్త్రీయంగా జరగాలి. కులసంఘాల పెద్దలు, మేధావులతో చర్చించాలి. ఆ తర్వాతే జీవో ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తున్నదని, మొదటి నుంచి కాంగ్రెస్ బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదని మండిపడ్డారు.
శాసనసభ రూల్స్, ప్రొసీజర్‌ను తుంగలో తొకారని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణలో నూటికి తొంభై శాతం బడుగు బలహీనవర్గాలు, దళితులు, గిరిజనులు, మైనార్టీ ప్రజలే ఉన్నారని, ఈ రోజు అసెంబ్లీలో ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నరని చెప్పారు. క్యాబినెట్ సమావేశం ఒకరోజు పెట్టుకుంటే ఏమయ్యేదని ప్రశ్నించారు. రథసప్తమి రోజు గుళ్లకు వెళ్లకుండా మమ్మల్ని సభకు పిలిచి అవమానించారని విమర్శించారు. మంత్రి శ్రీధర్‌బాబు చెప్పగానే ఒక నిమిషంలోనే సభను స్పీకర్ ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీగా తమ అభిప్రాయాన్ని కూడా స్పీకర్ అడగాల్సి ఉన్నదని చెప్పారు. సభను వాయిదా వేయడం కుట్రపూరితమని, సభను ఒకరోజే నిర్వహించడం అన్యాయమని మండిపడ్డారు. కేసీఆర్ ఏం చేశారో? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నదో? చైతన్యవంతులైన బీసీలు గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. బీసీలకు అన్యాయం మరో అతిపెద్ద ఉద్యమం రాబోతున్నదని, అది తెలంగాణ ఉద్యమం కన్నా తీవ్రంగా ఉండబోతుందని హెచ్చరించారు.