రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే గండ్ర సవాల్
హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు గత ఎన్నికలకన్నా ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా తన ఎమ్మెల్యే పదవికి, తన సతీమణి గండ్ర జ్యోతి జడ్పీ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తామని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. దమ్ముంటే రేవంత్ ఈ సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్‌చేశారు. శుక్రవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ దక్కదని తేల్చిచెప్పారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ అని, ఆయన ఎప్పటికీ చంద్రబాబు బినామీనే అని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులను తుపాకీతో బెదిరించి రైఫిల్రెడ్డిగా మారిన ఆయనకు ఉద్యమకారుల గురించి మాట్లాడే నైతిక హక్కులేదని చెప్పారు. తనపై రేవంత్ చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తన పరువుకు భంగం కలిగేలా అసత్య ఆరోపణలు చేసిన రేవంత్‌పై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. 2023 ఎన్నికల వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉంటావో లేదో చూసుకోవాలని ఎద్దేవాచేశారు.