దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కులగణన సర్వే పూర్తి చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం ఓ వైపు ప్రచారం చేసుకుంటుండగా అసలు ఈ సర్వే చెల్లుబాటు అవుతుందా? అని బీసీ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషన్లు కాకుండా ప్రభుత్వం సేకరించే డాటాకు సాధికారత ఉండబోదని, కేంద్రం నిర్దేశించిన నమూనాలోనే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో సర్వే చేస్తే ఫలితం ఉంటుందని న్యాయనిపుణులు, బీసీ మేధావులు స్పష్టం చేస్తుండగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. రిజర్వేషన్ల చట్టం వచ్చిన తర్వాతే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సీఎస్ శాంతికుమారికి శనివారం వినతిపత్రం ఇచ్చింది. కులగణన సర్వే తప్పుల తడకపై ఓవైపు పోరాటం చేస్తూనే మరోవైపు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం కార్యాచరణ రూపొందించేందుకు నేడు బీసీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ సమావేశం కానున్నారు.
Caste Census | హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన ఇంటింటి సర్వే చెల్లుబాటు అవుతుందా? తప్పుల తడక సర్వేకు ప్రామాణికత ఎంత? న్యాయపరంగా నిలుస్తుందా? లేక బీహార్ మాదిరిగానే అటకెక్కుతుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెరుగుతాయా? లేదా? ఇవీ తెలంగాణ బీసీ సమాజాన్ని తొలుస్తున్న ప్రశ్నల పరంపర. కులసంఘాల నేతలు, బీసీ మేధావులు ఈ సర్వేపై పలు అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు. కాం గ్రెస్ ప్రభుత్వం అనుసరించిన విధానరహిత, లోపభూయిష్టమైన పద్ధతులతో, ఇతర న్యాయపరమైన అంశాలను బీసీ మేధావి వర్గం, సామాజికవేత్తలు ఉదహరిస్తున్నారు.
సర్వే చెల్లుబాటయ్యే ప్రసక్తే లేదని ఒకవర్గం ఘంటాపథంగా చెప్తున్నది. చట్టబద్ధత కల్పించే దిశగానై ప్రభు త్వం కనీసం చిత్తశుద్ధిని కూడా చూపడం లేదని మరోవర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. వాస్తవంగా జనాభాగణన, సర్వే రెండూ వేర్వేరు. జనాభా గణన అంటే మొత్తం ప్రజల సమస్త సమాచారాన్ని సేకరించడం. సర్వే అనేది నిర్దేశిత లక్ష్యాలతో ఏదైనా ఒక అంశానికి సంబంధించి, మొత్తం జనాభాలో కొంతమంది శాంపిళ్లను ఎంపిక చేసుకుని నిర్వహించేది. అందుకు సంబంధించి దేశంలో రెండురకాల చట్టాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. జనాభా గణన అంశం అనేది 7వ షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వ జాబితాలోని అంశం.
1948 చట్టం ప్రకారం జనాభా గణన చేపట్టే అధికారం కేవలం కేంద్రానికే ఉన్నది. ఎలాంటి జనగణన నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు లేవు. ఒకవేళ చేసినా ఆ గణాంకాలకు చట్టబద్ధత ఉండకపోవడమే గాక, అమలు చేసే అవకాశం కూడా లేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వమే గణాంకాల సేకరణ చట్టం 2008 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు డేటా సేకరణకు కొన్ని పరిమిత అధికారాలను బదలాయించింది. నిర్దేశిత అంశానికి సంబంధించి గణాంకాలను సేకరించే అధికారాన్ని రాష్ర్టాలతోపాటు, కేంద్రపాలిత ప్రాంతాలకు, ఆ తర్వాత పంచాయతీలు, మున్సిపాలిటీలకు సైతం అధికారాలను కల్పించింది. అదే సమయంలో కొన్ని షరతులను కూడా విధించింది. 2017లో ఈ చట్టానికి మరిన్ని సవరణలను కూడా చేసింది. 2008 చట్టం ద్వారా 7వ జాబితాలోని జనాభా గణనను నిర్వహించవద్దు. ఒకవేళ రాష్ట్రం నిర్వహించాలని భావించినా అందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. అంతేకాదు సేకరించిన డాటా వెల్లడిపైనా అనేక ఆంక్షలను విధించింది.
రాష్ట్రంలో పేరుకు ఇంటింటి సమగ్ర సర్వే అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా, రాష్ట్రవ్యాప్తంగా జనాభా గణననే నిర్వహించిందని మేధావి వర్గం భావిస్తున్నది. గణాంకాల సేకరణ చట్టం 2008 ప్రకారం సర్వే నిర్వహించాలన్న కూడా కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉన్నది. 1952 రిజిస్ట్రార్ ఆఫ్ ఎంక్వయిరీస్ చట్టం ప్రకారం స్వయం ప్రతిపత్తి కలిగిన కమిషన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు, గణాంకాల సేకరణకు ఒక ప్రభుత్వ శాఖను నోడల్ డిపార్ట్మెంట్గా నియమించడంతోపాటు, నోడల్ ఆఫీసర్‌ను, కమిషన్‌కు సెక్రటరీని నియమించాల్సి ఉంటుంది. నేషనల్ ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్ డిపార్ట్మెంట్, స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్, ఎన్ఎస్ఎస్వో తదితర విభాగాల నుంచి రాష్ర్టానికి చెందిన తాజా ఇండ్ల జాబితాను, బ్లాక్‌ల వారీ గా రూపొందించిన ఇండ్ల మ్యాపులను కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక సర్వే ప్రశ్నావళి రూపకల్పనకు సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉన్నది. సేకరించిన డాటాను కూడా అందుబాటులో ఉన్న ప్రామాణికమైన ఓటరు, ఆధార్ జాబితాలు, రేషన్‌కార్డుదారులు తదితర వాటితో విశ్లేషించాల్సి ఉన్నది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ ఉపాధి, రాజకీయ అవకాశాలకు సంబంధించిన స్థితిగతులను తులనాత్మక అధ్యయనం చేయాల్సి ఉన్నది. తుదకు అన్నింటినీ క్రోడీకరించి, విశ్లేషించి తుది నివేదికను రూపొందించాలి. క్యాబినెట్ ఆమోదం పొందాల్సి ఉన్నది. ఆ తర్వాత కేంద్రం ఆమోదంతో ఆ గణాంకాలను ప్రామాణికంగా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుందని న్యాయకోవిదులు, నిపుణులు, బీసీ మేధావులు వెల్లడిస్తున్నారు.
తెలంగాణ ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ర్టానికి జనాభా గణన నిర్వహించే అధికారాలు లేని కారణంగానే అందుకు సంబంధించిన వివరాలను నాటి ప్రభుత్వం వెల్లడించలేదు. కమిషన్లు కాకుండా ప్రభుత్వం సేకరించే డాటాకు సాధికారత ఉండబోదని న్యాయనిపుణులు, బీసీ మేధావులు వివరిస్తున్నారు. ప్రస్తుత సర్వే గణాంకాలు కూడా అటకెక్కే పరిస్థితి ఉన్నదని వివరిస్తున్నారు. కేంద్రం నిర్దేశించిన నమూనాలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో సర్వే చేస్తే ఫలితం ఉంటుందని, న్యాయసమీక్ష ఎదుట నిలబడే అవకాశం ఉంటుందని బీసీ మేధావులు సైతం తేల్చిచెప్తున్నారు.
కులగణన అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆది నుంచీ నిబంధనలన్నింటికీ తిలోదకాలిచ్చింది. బీహార్ ప్రభుత్వం తరహాలోనే ప్రణాళిక శాఖకు డాటా సేకరణ బాధ్యతలను అప్పగించింది. ఎందుకంటే డాటా సేకరణకు కావాల్సిన మానవ వనరులు, ఇతర వసతులు బీసీ కమిషన్‌కు లేవని చెప్తున్నది. అయినా బీసీ కమిషన్‌కు ప్రణాళిక శాఖను నోడల్కు ఏజెన్సీగా అనుసంధానం చేసే అవకాశం ఉన్నా ఆ పనిని ప్రభుత్వం చేయలేదు. పూర్తిగా డాటా సేకరణను ప్రణాళిక శాఖకే అప్పగించింది. ఈ మేరకు నవంబర్ 10న జీవో 18ని విడుదల చేసింది. ప్రణాళిక శాఖకు ఇచ్చిన ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టమైన వివరాలను ఎక్కడా పేర్కొనలేదు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఇంటింటి సర్వే (సామాజిక, విద్యా, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కులాల వారీగా) అని మాత్రమే పేర్కొన్నది. ఎందుకోసం చేస్తున్నామనేది కూడా ఎక్కడా పేర్కొనలేదు. నిరుడు ఫిబ్రవరిలో క్యాబినెట్, ఆపై అసెంబ్లీలో చేసిన తీర్మానాలను మాత్రమే రెఫరెన్స్‌గా ఇచ్చింది. దీంతో ప్రణాళిక శాఖకు ఇచ్చిన ఉత్తర్వులు సైతం అస్పష్టంగానే ఉన్నాయని బీసీ మేధావివర్గం మండిపడుతున్నది. ప్రణాళిక శాఖ డాటా సేకరణకు చట్టబద్ధత లేకపోగా, అధికారికంగా వినియోగించే పరిస్థితి కూడా ఉండబోదని బీసీ వర్గాలు, న్యాయకోవిదులు వివరిస్తున్నారు. అంతిమంగా సర్వే న్యాయస్థానాల ఎదుట చెల్లుబాటు కావడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డదిడ్డంగా చేపడుతున్న, జారీ చేస్తున్న మార్గదర్శకాలతో న్యాయచిక్కులు కూడా తప్పవని బీసీ మేధావి వర్గాలు, న్యాయకోవిదులు హెచ్చరిస్తున్నారు. బీహార్‌తోపాటు, మహారాష్ట్రను ఉదహరిస్తున్నారు. గతంలో బీహార్ రాష్ట్ర సర్కారు నిర్వహించిన కులగణన కోర్టుకెక్కింది. బీహార్ ప్రభుత్వం రాష్ట్ర ప్రణాళికశాఖ ఆధ్వర్యంలో కులగణన నిర్వహించింది. ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీల లెక్కలను తీసింది. అందుకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని మొత్తంగా 65 శాతానికి పెంచింది.
ఈడబ్ల్యూఎస్ కోటా కలుపుకుంటే ఆ రిజర్వేషన్లు 75 శాతానికి పెరిగింది. ఇది 50 శాతం కోటా పరిమితిని మించిపోతున్నదని, బీహార్ రాష్ట్రం నిర్వహించిన కులగణన చెల్లుబాటు కాదని, ఆ అధికారాలు లేవని అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ అనేక మంది పాట్నా హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ల అమలు మళ్లీ మొదటికి వచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం సైతం ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాలకు విరుద్ధంగా డెడికేషన్ కమిషన్‌ను కాదని, డాటా సేకరణ బాధ్యతలను అక్కడి పంచాయతీరాజ్ శాఖకు అప్పగించింది. తుదకు సుప్రీంకోర్టు అడ్డుచెప్పడంతో మళ్లీ కమిషన్ ద్వారానే చేయించింది.