నమస్తే న్యూస్ నెట్వర్క్, ఆగస్టు 18: అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ములుగు జిల్లాతోపాటు ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలుకురిశాయి. కుండపోత వర్షానికి ములుగు జిల్లా అతలాకుతలమైంది. మంగపేట మండలంలో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన వర్షంతో మండలంలోని అన్ని వాగులు, వంకలు పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కమలాపురంలోని ఎర్రవాగు పొంగడంతో ఇండ్లలోకి వరద వచ్చి వస్తువులు కొట్టుకుపోయాయి. మంగపేట నుంచి మణుగూరు వెళ్లే ప్రధాన రహదారిపైకి భారీగా వరద వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరదలో పడిపోయిన మంగపేట ఎంపీడీవోను ఉద్యోగులు కాపాడారు. తాడ్వాయి మండలంలో జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. కాల్వపల్లికి చెందిన సోలం గౌరమ్మ(55) ఆదివారం సాయంత్రం వాగు వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు కొట్టుకుపోగా సోమవారం ఉదయం మృతదేహం లభిచింది.
మంగపేట, ఏటూరు నాగారం మండలాల్లో అత్యధికంగా 17.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం రోజంతా మురుసు పట్టింది. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. సోమవారం సాయంత్రం 4 గంటలకు 37.50 అడుగులకు చేరింది. రాత్రికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. పర్ణశాల వద్ద నారచీరల ప్రాంతం నీట మునిగింది. పలుచోట్ల వాగులు ఉధృతంగా పారుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సోమవారం కూడా వర్షం కురిసింది.
జైనథ్‌లో 10.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాతోపాటు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో వార్ధా, ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సిర్పూర్(టి) సరిహద్దుల్లోని హుడిలికి వద్ద నది పొంగడంతో వంతెన పైనుంచి భారీగా వరదనీరు ప్రవహిస్తున్నది. దీంతో మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు, చెక్‌డ్యామ్‌లను వరద ముంచెత్తింది.
సంగారెడ్డి జిల్లా వాసర్‌కు చెందిన పవన్ అనే వ్యక్తి గ్రామానిక వెళ్లేందుకు ఆదివారం రాత్రి ఊరవాగు దాటే ప్రయత్నం చేయగా వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది. పవన్ అప్రమత్తమై కారులో నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. వర్షాలకు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంజీర నది తీర ప్రాంతమైన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో 2 వేల ఎకరాలకు పైగా పంటలు నీట మునిగాయి. నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌తోనూ వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది.
నిజామాబాద్ జిల్లాలో సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు, సిబ్బంది
నేల కొరిగిన భారీ వృక్షాలు
ములుగు జిల్లా ఏటూరునాగారం-కమలాపురం మధ్య జీడివాగులో లోలెవల్ కాజ్వే వద్ద భారీ వర్షానికి చెట్లు కూలి రోడ్డుకు అడ్డుగా పడడంతో తొలగిస్తున్న పోలీసులు
వరద గోదావరి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
జర భద్రం..
నారాయణపేట జిల్లాలో వాగును ప్రమాదకరంగా దాటుతున్న జనం