హైదరాబాద్, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న స్పెషల్ సిట్ స్వతంత్రతపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి ప్రలోభాలు, ప్రమేయం లేకుండా నిష్పక్షపాతంగా విచారించాల్సిన సిట్ ఉన్నతాధికారులే అనుకూల మీడియాకు ఎప్పటికప్పుడు లీకులు ఇస్తుండటం విమర్శలకు తావిస్తున్నది. ‘ఫోన్ ట్యాపింగ్’ కేసులో రెండోసారి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసిన నాటినుంచే లీకుల వరద పారుతున్నదని విశ్లేషకులు అంటున్నారు. సిట్ ఏర్పడిన డిసెంబర్ 18వ తేదీనే ‘కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు నోటీసులు.. విచారణ, ఆపై అరెస్టులు’ అంటూ మొదలైన స్పెషల్ సిట్ లీకుల ప్రస్థానం.. ఆసాంతం లీకులమయంగానే మారిందని వారు అభిప్రాయపడుతున్నారు. సిట్ అధికారులు ఎవరికి నోటీసులు ఇవ్వబోతున్నారో? ఎవరిని ఎప్పుడు విచారణకు పిలుస్తారో? విచారణ రోజు సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో? కూడా ముందే ఆ మీడియాలో ప్రసారం అవుతుండటాన్ని పరిశీలిస్తే.. సిట్ అధికారులు కూడా ఎవరి ఒత్తిళ్ల మేరకు బీఆర్ఎస్ పార్టీ నేతలను విచారిస్తున్నదో తెలుస్తున్నదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
‘నెక్ట్స్’ అంటూ ముందే లీకులు
స్పెషల్ సిట్ ఏర్పడిన తర్వాత.. 160 సీఆర్పీసీ కింద హరీశ్‌రావుకు హైదరాబాద్‌లో నివాసంలో నోటీసులు ఇవ్వకముందే.. ఎలక్ట్రానిక్ మీడియాలో ‘హరీశ్‌రావుకు సిట్ పిలుపు’ అంటూ ‘బిగ్ బ్రేకింగ్స్’ వచ్చాయి. ఆ మరసటి రోజున ‘నెక్ట్స్ సిట్ విచారణకు కేటీఆర్’ అంటూ ఆ పత్రికలు కథనాలు రాయగా.. ఎలక్ట్రానిక్ మీడియాలో ‘ప్యాకేజీ’ కథనాలు వండివార్చారు. ఆ లీకులను నిజం చేస్తూ.. మరుసటి రోజే కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఆ రెండ్రుజుల్లోనే ‘తర్వాత విచారణకు సంతోష్‌కుమార్’ అంటూ కథనాలు వచ్చాయి. సంతోష్ విచారణ ముగిసిన రోజే.. ‘నెక్ట్స్ కేసీఆర్’ అంటూ లీకులు వరద పారింది. ఆ లీకులను నిజం చేస్తూనే కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. కేసీఆర్ విచారణ సందర్భంగా సిట్ పరిధి, ఇతర అంశాలు, హైదరాబాద్‌లోనే విచారణలంటూ కథనాలు రాయించారు.
విచారణప్పుడూ.. విచారణ తర్వాత కూడా..
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్-1నుంచి.. రెండోసారి ఏర్పడిన స్పెషల్ సిట్ వరకూ.. విచారణలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో.. మినిట్ టు మినిట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం అయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఎంతమంది అధికారులు ప్రశ్నిస్తున్నారు? వారి పేర్లు ఏమిటి? ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? విచారణ ఎదుర్కొంటున్నవారు ఏం సమాధానాలు ఇస్తున్నారు? ఎన్ని గంటలకు టీ బ్రేక్ ఇచ్చారు? మళ్లీ ఎప్పుడు విచారణ ప్రారంభించారు? ఎప్పుడు లంచ్‌కి తీసుకెళ్లారు? ట్యాబ్లెట్లు వేసుకున్నారా? లేదా? అనే ప్రతి విషయాన్నీ ప్రతి బులెటిన్లలో ప్రసారం అయ్యాయని చెబుతున్నారు. ఇలా లీకులు ఇచ్చుకుంటూ వెళ్తున్న ఈ సిట్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులు విచారించే అర్హత ఉన్నదా? అని ప్రశ్నిస్తున్నారు.
కోర్టుల కంటే ముందే తీర్పులు
విచారణ అంశాలు, చార్జిషీట్లు, ఇతర ముఖ్యమైన ఆధారాలు సీల్డ్ కవర్లలో కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. కానీ కోర్టుల కంటే ముందే అనుకూల మీడియాలో విచారణ వివరాలపై కథనాలు వస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ‘ఎంతో నిబద్ధత గల ఆఫీసర్’ అంటూ సోషల్ మీడియాలో తన పీఆర్ టీంతో పోస్టులు పెట్టించుకుంటున్న ఓ ఉన్నతాధికారి కూడా ట్వీట్లతో ‘అక్రమ ఫోన్ ట్యాపింగ్’ అంటూ ముందుగానే జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన లీకులు ఇచ్చే స్తూ.. విచారణ వివరాలను కోర్టుకు కాకుండా ముందుగానే ప్రభుత్వ పెద్దలకు చేరవేస్తూ.. వారి డైరెక్షన్లో నోటీసులిస్తూ.. వారికి అనుకూలమైన ప్రశ్నలను అడిగిస్తూ అడుగడుగునా సిట్ నిబంధనలకు తూట్లు పొడిచారని విశ్లేషకులు అంటున్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ దర్యా ప్తు సంస్థలను అపహాస్యం చేస్తున్నారని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.