హైదరాబాద్, నవంబర్ 7(నమస్తే తెలంగాణ) : ‘నేను సచివాలయానికి రావడం లేదు. మొత్తం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే నడిపిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపిస్తున్నారు. అవును, కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నేను సీఎం క్యాంప్ ఆఫీస్‌గా ఉపయోగించుకుంటున్నాను. అందులో తప్పేముంది’ హరీశ్‌రావు విమర్శలకు సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇది. ఈ వ్యాఖ్యలు చేసిన నిమిషాల వ్యవధిలోనే కమాండ్ కంట్రోల్ సెంటర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మాటమార్చారు. ‘బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో ఏ ఒక్కరికీ ఉపయోగంలేదు. నాడు కేసీఆర్ తనకు గిట్టని వారి ఇంటి వద్ద సీసీ కెమెరాలు పెట్టించి పసిగట్టేందుకు మాత్రమే దీన్ని ఉపయోగించుకున్నారు’ అంటూ పూర్తి విరుద్ధ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం, కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయం, ప్రగతిభవన్ వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. ఓవైపు నిత్యం కమాండ్ కంట్రోల్ సెంటర్లో తిష్ట వేస్తున్న రేవంత్‌రెడ్డి అక్కడే ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలాంటి కమాండ్ కంట్రోల్ సెంట్రల్ ఎందుకూ పనికిరాదని, దీని వల్ల ఎవరికీ ఉపయోగం లేదని చెప్పడం గమనార్హం.
ఇక, కాళేశ్వరం ప్రాజెక్టుపైనా సీఎం తన అక్కసును మరోమారు వెళ్లగక్కారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని కొత్త ఆయకట్టుతోపాటు స్థిరీకరణ కలిపి సుమారు 17 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించినట్లు పలు నివేదికలు, పలు ప్రజెంటేషన్లలో వెల్లడించింది. కానీ రేవంత్‌రెడ్డి మాత్రం ఆ వాస్తవాలను దాస్తూ కాళేశ్వరంపై మళ్లీ బురద జల్లారు. ప్రగతి భవన్‌పైనా అదే అక్కసు వెళ్లగక్కారు. ప్రగతి భవన్‌ను నాడు సీఎం కేసీఆర్ తన విలాసం కోసం నిర్మించుకున్నారంటూ గతంలో చేసిన ఆరోపణలనే మళ్లీ చేశారు. దీనివల్ల ఎలాంటి ఉపయోగమూ లేదన్నారు. కానీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందులో ఎందుకు నివాసం ఉంటున్నారనే ప్రశ్నలకు సమాధానం లేదు. సచివాలయంపైనా సీఎం పాత ఆరోపణలే చేశారు. అద్భుత శైలిలో నిర్మించిన తెలంగాణ సచివాలయం రాష్ర్టానికే గొప్ప చిహ్నంగా మారింది. అక్కడి నుంచే రాష్ట్ర పరిపాలనా సవ్యంగా జరుగుతున్నది. అలాంటి సచివాలయంతో ఏం ఉపయోగం లేదని చెప్పడం గమనార్హం. రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది.