HomeTelanganaWhy Do I Need A Department With Neither Funds Nor Water A Minister Expresses Severe Dissatisfaction With His Own Portfolio
నిధులు, నీళ్లు లేని శాఖ నాకెందుకు?.. తన శాఖ మీద ఓ మంత్రి తీవ్ర అసంతృప్తి
నీళ్లు, నిధులు లేని శాఖ తనకు వద్దంటే వద్దని ఒక సీనియర్ మంత్రి పట్టుబడుతున్నారా? మూడేండ్ల నుంచి కూలుడు, కుంగుడు, ఆరోపణలు, పంచాయితీలు తప్ప పైసా ఆమ్దాని లేదనే అసంతృప్తితో ఉన్నారా? బడ్జెట్లో అరకొర నిధులు కేటాయిస్తున్నారని, అందులో నూ 20% నిధులు కూడా ఖర్చు చేయడంలేదని విరక్తితో ఉన్నారా?
గత ప్రభుత్వం రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తే మన ప్రభుత్వం పెట్టింది రూ.600 కోట్లే
రూ.4,230 కోట్లు విడుదల చేస్తే రూ.3,600 కోట్లు పాత బకాయిలకే
మిగిలిన సొమ్ములో 85% నిధులు 3 బడా కాంట్రాక్ట్ కంపెనీలకేనని తీవ్ర అసంతృప్తి
మంత్రివర్గ ప్రక్షాళన చేస్తే తన నుంచి ఆ శాఖను తొలగించాలని ఢిల్లీకి ఉత్తరాలు
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): నీళ్లు, నిధులు లేని శాఖ తనకు వద్దంటే వద్దని ఒక సీనియర్ మంత్రి పట్టుబడుతున్నారా? మూడేండ్ల నుంచి కూలుడు, కుంగుడు, ఆరోపణలు, పంచాయితీలు తప్ప పైసా ఆమ్దాని లేదనే అసంతృప్తితో ఉన్నారా? బడ్జెట్లో అరకొర నిధులు కేటాయిస్తున్నారని, అందులో నూ 20% నిధులు కూడా ఖర్చు చేయడంలేదని విరక్తితో ఉన్నారా? తన శాఖకు చెందిన పవర్ఫుల్ కాంట్రాక్టు సంస్థలను ముఖ్యనేత గుప్పిట్లో పెట్టుకున్నాడనే ఆగ్రహంతో ఉన్నారా?
తన నుంచి ఆ శాఖను తొలగించి మరో కీలకమైన శాఖ ఇవ్వాలని అధిష్ఠానానికి ఆయ న ఉత్తరాలు రాశారా? వరుస ఉత్తరాల నేపథ్యంలో ఢిల్లీ అధిష్ఠానం ఆయనను నేరుగా పిలిపించుకొని వివరాలు అడిగిందా? త్వరలో జరుగబోయే మంత్రివర్గ సర్దుబాట్లలో శాఖ మార్చి, తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ఢిల్లీ హామీ ఇచ్చిందా? అంటే ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వం లో ఒక వెలుగు వెలిగిన ఆ శాఖ ఇప్పుడు నీళ్లు, నిధులు లేక కూనారిల్లిపోతున్నదని, తాను బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూలుడు, కుంగుడు గొడవలకు వివరణ తప్ప మరో పని చేయలేకపోతున్నానని సీనియర్ మంత్రి నేరు గా ఢిల్లీకి ఉత్తరాలు రాసినట్టు తెలిసింది. ఒకరకంగా ఆ శాఖ తనకు గుదిబండలా ఉన్నదని, తన సమర్థతకు ఇది సరితూగదని ఢిల్లీ అధిష్ఠానానికి మొరపెట్టుకున్నట్టు తెలిసింది.
బడా కంపెనీలకు చెల్లింపు చిట్టా పట్టుకొని
2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రగతి పద్దులో ఆ శాఖకు రూ.12,260 కోట్లు ప్రతిపాదించింది. ఎస్ఎల్బీసీ, దేవాదుల, కల్వకు ర్తి, రాజీవ్‌భీమా, నెట్టెంపాడు, వరదకాలువ, ఎల్లంపల్లి, డిండి, సీతమ్మసాగర్, చనాక-కొరటా, చిన్నకాళేశ్వరం తదితర ప్రాజెక్టులను ప్రాధాన్యతగా ఎంచుకున్నది. ఈ ప్రాజెక్టుల పూర్తికే రూ.4,860 కోట్లు అవసరమని అంచ నా వేసింది. ఇందులో రూ.4,230 కోట్లు మాత్రమే నిధులు కేటాయించింది. ఇందుల్లో అచ్చంగా ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేసింది రూ.600 కోట్లు మాత్రమేనని, మిగిలిన సొమ్ములో దాదాపు 85% నిధులు బడా కాంట్రాక్టర్ల అప్పుల కిందనే పోయినట్టు సదరు మంత్రి సన్నిహితులు చెప్తున్నారు.
తన ప్రమేయం లేకుండానే ముఖ్యనేత కనుసన్నల్లోనే బిల్లుల చెల్లింపులు జరిగిపోతున్నాయని మంత్రి సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది. ఒక బడా సంస్థకు ఇప్పటివరకు రూ.2,900 కోట్లు చెల్లించినట్టు సదరు మంత్రి సమగ్ర ఆధారాలు తీసుకొని దగ్గర పెట్టుకున్నట్టు తెలిసింది. అదేవిధంగా ఓ అమాత్యుడికి సంబంధించిన కంపెనీకి రూ.920 కోట్లు, మరో కీలక కాంగ్రెస్ నేతకు సంబంధించిన కంపెనీకి రూ.300 కోట్లు చెల్లించినట్టు మంత్రి వద్ద వివరాలు ఉన్నాయని సమాచారం.
వేతనాలు ఇచ్చుకోలేక..
డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెం ట్ ప్రోగ్రామ్ (డ్రిప్), పీఎం కృషి సించాయ్ యోజన తదితర కేంద్ర ప్రయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్ర వాటా నిధులను ఇవ్వడం లేదని, దీంతో కేంద్రం విడుదల చేసిన నిధులు ల్యాప్స్ అవుతున్నాయని ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని సదరు మంత్రి ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఓఅండ్‌ఎంకు సంబంధించి రూ.150 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
ప్రాజెక్టులకు సంబంధించే కాదు, శాఖకు సంబంధించి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, వెహికిల్స్ అలవెన్స్‌లు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో సదరు మంత్రి ఆర్థిక శాఖను అడిగి నా.. రూపాయి కూడా ఇవ్వకపోవడంతో ఆయన చిన్నబుచ్చుకున్నట్టు తెలిసింది. తన ఉద్యోగులకు అలవెన్స్‌లు కూడా ఇప్పించలేని ఈ శాఖ ఉండి కూడా ప్రయోజనం లేదని మంత్రి వాపోయినట్టు తెలిసింది. తన శాఖ మార్చాల్సిందేనని గతంలోనే సీఎంకు చెప్పిన మంత్రి, అనంతరం కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా లేఖలు రాసినట్టు తెలిసింది.
అసెంబ్లీలోనే వివాదం బహిర్గతం
ఈ ఏడాది జనవరిలో అసెంబ్లీ వేదికగా కృష్ణా, గోదావరి ఇరిగేషన్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎవరు ఇవ్వాలనే అంశంతో ముఖ్యనేతకు, సదరు మంత్రికి మధ్య వివాదం చెలరేగినట్టు తెలిసింది. ఇద్దరి మధ్య ప్రత్యక్షంగా వాగ్వాదం జరిగినట్టు చెప్తున్నారు. ఆ శాఖ మంత్రిగా పీపీటీ తన బాధ్యత అని సదరు మంత్రి కరాఖండిగా చెప్పగా.. ముఖ్యమంత్రి సభలో ఉండగా, మీరు పీపీటీ ఇవ్వడం సభా మర్యాద కాదని వారించినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అసెంబ్లీలోనే ఇద్దరు నేతల మధ్య దాదాపు 20 నిమిషాలు చర్చ జరిగినట్టు అప్పట్లో అసెంబ్లీ లాబీల్లో చర్చ జరిగింది. చాంబర్ నుంచి విసురుగా వెళ్లిపోయిన సదరు మంత్రి దాదాపు 45 నిమిషాలపాటు ఎవరినీ కలువకుండా ఒంటరిగా గడుపడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
అ సందర్భంలో ఢిల్లీకి ఫోన్లు చేసి తనకు ఆ శాఖ వద్దని చెప్పినట్టు సమాచారం. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో కానీ, ముఖ్యనేత పక్కకు జరిగి, సదరు నేతకే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇచ్చినట్టు సమాచారం. ఇన్ని సమస్యల నేపథ్యంలో తన శాఖ మార్చాలని సీనియర్ మంత్రి ఢిల్లీ అధిష్ఠానాన్ని మరోసారి కోరినట్టు తెలిసింది. త్వరలోనే మంత్రివర్గ ప్రక్షాళన, విస్తరణ ఉంటుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తనకు కొత్త శాఖ కేటాయించాలని అధిష్ఠానాన్ని కోరినట్టు తెలిసింది. ఆయన ఆవేదనను అర్థం చేసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను ఢిల్లీకి పిలిచి శాఖ మారుస్తామనే హామీ ఇచ్చినట్టు సమాచారం.