WhatsApp Groups | హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : గ్రామాల వాట్సాప్ గ్రూపుల్లోకి ఎంట్రీ ఇచ్చి.. పోలీసుల ద్వారా గ్రామస్థుల సంభాషణలు, అభిప్రాయాలను తెలుసుకోవాలన్న ప్రభుత్వ ఆలోచనకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ‘నమస్తే తెలంగాణ’ కథనంతో అలర్ట్ అయిన ప్రజలు.. పోలీసుల ఎంట్రీపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ‘మన గ్రూపుల్లోకి పోలీసులు వచ్చి ఏం సమాచారం తెలుసుకుంటారు? ఎందుకోసం రావాలనుకుంటున్నారు? ప్రజా సమస్యలు పక్కనపెట్టి.. ఇలాంటి ఆలోచనలు ఎందుకు చేస్తున్నారు? అంత ఖాళీగా ఉన్నారా?’ అంటూ చర్చించుకుంటున్నారు. ఈ మేరకు ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనాన్ని తమ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తూ, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు చేసుకుంటున్నారు. ‘మన గ్రూపుల్లోకి పోలీసులు వస్తే.. ప్రశాంతంగా వాట్సాప్ మెసేజ్లు ఏం చేసుకుంటాం’ అని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇకపై మన గ్రామంలో.. మనకే వాక్ స్వాతంత్య్రం ఉండదా?’ అని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘గ్రామాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవారిని కట్టడి చేయడానికి, అవసరమైతే అరెస్టు చేసి, భయపెట్టి దారిలోకి తెచ్చుకునేందుకే ఈ నాటకాలు..’ అంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామస్థాయిలో విషయాలు తెలుసుకునేందుకు ఇప్పటికే వివిధ గ్రూపుల్లో ఉన్న ఇంటెలిజెన్స్ సిబ్బందిపై ప్రభుత్వ పెద్దల అత్యుత్సాహ ప్రభావం పడింది. కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా… ఏదో ఒక పేరుతో ఇప్పటికే ఉన్న కొన్ని గ్రూపుల్లోని ఇంటెలిజెన్స్ సిబ్బంది నంబర్లను అడ్మిన్లు తొలగిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. వివాదాలు, గొడవలు ఇతర అంశాలపై గ్రామాల్లోకి గస్తీకి వస్తున్న పోలీసులు వాట్సాప్ గ్రూపుల ప్రస్తావన తీసుకొస్తూ తమను యాడ్ చేయాలని అడుగుతున్నారు. దీంతో ‘ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే డయల్ 100కి కాల్ చేస్తాం లే సార్. మా ఊర్లో మస్తు విషయాలు ఉంటాయి. అవన్నీ మీకెందులే సార్’ అని సున్నితంగా తిరస్కరిస్తున్నట్టు తెలిసింది.