హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): దమ్ముంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరో ఆ పార్టీ నేత రాహుల్‌గాంధీ ఖమ్మం సభలో ప్రకటించాలని రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆరే మళ్లీ సీఎం అభ్యర్థి అని పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారని తెలిపారు. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ తమ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరో తేల్చలేదని పేర్కొన్నారు. నాయకుడు ఎవరో తెలియని పార్టీకి ప్రజలు ఎలా ఓటేస్తారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు ఇప్పటికీ మానని గాయాల్లా ప్రజలను బాధ పెడుతున్నాయని, ముదిగొండలో ఇండ్ల స్థలాలు అడిగినందుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కరశంగా తుపాకీ గుండ్ల వర్షం కురిపించి అమాయకులను పొట్టనపెట్టుకున్నదని తెలిపారు.
ఆ ఘటన నేటికీ ఖమ్మం ప్రజల కండ్ల ముందే కదలాడుతున్నదని పేర్కొన్నారు. దీనికి ఆనాటి కాల్పుల్లో గాయపడిన వారే ప్రత్యక్ష సాక్షులని తెలిపారు. నాడు తూటాల చప్పుడు వినిపించిన నేలపైనే సభ పెడుతున్న రాహుల్‌గాంధీ ముందుగా ఆ అమరుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్లలో గిరిపుత్రులను పట్టించుకోలేదని, పోడు భూముల గురించి ఆలోచన చేయలేదని, కానీ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూములకు పట్టాలిచ్చి వారికి రైతుబంధు, రైతుబీమా, నీటి వసతి కోసం బోర్లు, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి గిరిపుత్రులను సిరిపుత్రులుగా చేసేందుకు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.