Retired Employees | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో కొనసాగింపుపై పనిచేస్తూ వచ్చిన విశ్రాంత ఉద్యోగులను తొలగించిన రాష్ట్ర సర్కారు.. వారి బాధ్యతలను ఇతర అధికారులకు అప్పగించడంలో తాత్సారం చేస్తున్నది. తొలగించిన రిటైర్డ్ ఉద్యోగుల స్థానంలో ఇన్చార్జులను నియమించకపోవడంతో ఫైళ్లు పేరుకుపోయి, పనులు పడకేశాయి. కీలకస్థానాల్లో ఉన్నవారిని సైతం పక్కన పెట్టడంతో ఆయా శాఖల కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏయూడీ)నుంచి 177 మంది విశ్రాంత ఉద్యోగులను ప్రభుత్వం తొలగించింది. ఆ జాబితాలో అటెండర్ నుంచి ఐఏఎస్ అధికారి వరకు ఉన్నారు.
వైటీడీఏ వైస్ చైర్మన్, ఎండీ కిషన్‌రావు, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్ఎంఆర్ఎల్ సీఈఈ డీవీఎస్ రాజు, వాటర్‌బోర్డులో సత్యనారాయణ, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, ట్రాన్స్‌కో, జెన్కో డైరెక్టర్లు ఇలా.. ప్రధాన శాఖల్లో కీలక వ్యక్తుల స్థానాలు ఖాళీగా ఉండటంతో కార్యకలాపాలు స్తంభించాయి. గతంలో ఏ ఉద్యోగిని అయినా తొలగిస్తే లేదా బదిలీ చేస్తే వెంటనే ఇన్చార్జిగా మరో వ్యక్తికి బాధ్యతలు అప్పగించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు.
ఏదైనా శాఖలో అయినా విశ్రాంత అధికారి లేదా ఉద్యోగి సేవలు అత్యవస రం అనుకుంటే, ఆ శాఖ అధిపతి ఇచ్చే వివరణను పరిశీలించి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలా? వద్దా? అనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటున్నదని మార్చి 25న సర్కారు ఉత్తర్వుల్లోనే తెలిపారు. తొలగించిన 6,729 మందిలో తిరిగి నియామకం అయ్యే అవకాశం ఉన్న వ్యక్తులు పలువురు ఉంటారని సచివాలయవర్గాల్లో చర్చ నడుస్తున్నది. కానీ వారం గడుస్తున్నా నిర్ణయం తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది.