హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఏపీ పట్ల వల్లమాలిన ప్రేమ చూపుతున్నది. తద్వారా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నది. మంగళవారం జరిగిన కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశమే ఇందుకు ఉదాహరణ. నాగార్జునసాగర్ నీటి కేటాయింపుల కోసం సమావేశమైన ఈ కమిటీ.. ప్రస్తుతమున్న 28 టీఎంసీల నీటిలో ఏపీకి 10, తెలంగాణకు 16 టీఎంసీల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఇక్కడ ఏపీ కంటే తెలంగాణకే ఎక్కువ నీరు కేటాయించినట్టు కనిపిస్తున్నప్పటికీ అదంతా పెద్ద మోసం. ఇప్పటివరకు వినియోగించుకున్న నీటి లెక్కల ప్రకారం అసలు ఏపీకి ఎలాంటి కేటాయింపులు జరగకూడదు.
ఎందుకంటే ఇప్పటివరకు 66% నీటిని మాత్రమే వినియోగించుకోవాల్సిన ఏపీ ఏకంగా 75% మేరకు వినియోగించుకున్నది. తెలంగాణ 34% నీటిని వాడుకోవాల్సి ఉండగా కేవలం 25% మాత్రమే వాడుకున్నది. ఇలా ఏపీ తన కోటాకు మించి నీటిని ఉపయోగించుకోవడాన్ని అడ్డుకోవాల్సిన తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసి చోద్యం చూస్తున్నది. ఏపీ సర్కార్‌తో సీఎం రేవంత్‌రెడ్డి లోపాయికారి ఒప్పందం చేసుకొని తెలంగాణకు దక్కాల్సిన నీటిని పొరుగు రాష్ర్టానికి దారాదత్తం చేస్తున్నారని, మన రాష్ట్రం ఏడారిగా మారినా, పంటలు ఎండిపోయినా, తాగునీటికి కటకట ఏర్పడినా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.