హైదరాబాద్ : బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నీటిని ఒడిసిపట్టిండ్రని, ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి విడిచిపెట్టిండని మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. ఏపీ పాలకులతో కలిసి తెలంగాణకు జలద్రోహం చేస్తున్నడని విమర్శించారు. రేవంత్‌రెడ్డి దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని హెచ్చరించారు. ఢిల్లీలో ఇవాళ ఏపీ, తెలంగాణ జలవివాదానికి సంబంధించిన సమావేశం నేపథ్యంలో.. హరీష్‌రావు తెలంగాణభవన్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటుచేసి మాట్లాడారు. ఏపీ ఒత్తిడితో కేంద్రం నిర్వహిస్తున్న ఈ మీటింగ్‌ను బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
‘తెలంగాణ నీటి హక్కులను కాలరాసేందుకు ఏపీ ఒత్తిడితో కేంద్రం నిర్వహిస్తున్న ఇవాళ్టి ఢిల్లీ సమావేశాన్ని
బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. నువ్వు పెట్టిన కండీషన్లకు వచ్చిన సమాధానం బయటపెట్టాలి. రేవంత్ రెడ్డీ.. నీ గురుదక్షిణ కోసం తెలంగాణకు ద్రోహం చేస్తుంటే ఈ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. నీ దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడుతాం. తెలంగాణ నీటి హక్కుల కోసం మరో పోరాటం చేస్తం’ అని హరీష్‌రావు హెచ్చరించారు.
‘కేసీఆర్ పాలన గురించి ఎకనామిక్ సర్వే రిపోర్టే స్పష్టం చేసింది. తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించింది. రెండు కోట్ల 20 లక్షల ఎకరాలు మాగాణిగా మారింది. కాళేశ్వరం, మిషన్ కాకతీయ ద్వారా అద్భుతమైన ఆయకట్టు వచ్చింది. కాళేశ్వరం ద్వారా 17 లక్షల 823 ఎకరాల స్థిరీకరణ, మిషన్ కాకతీయ ద్వారా పదిహేను లక్షల ఎకరాల ఆయకట్టు సాధ్యమైంది. 32 లక్షల ఎకరాల ఆయకట్టు బీఆర్ఎస్ సాధించింది’ అని మాజీ మంత్రి చెప్పారు.
‘బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇప్పటికైనా నోరు పారేసుకోవడం మానుకుంటే మంచిది. కేంద్రంలోని మీ ప్రభుత్వమే తెలంగాణ ప్రగతిపథాన్ని వివరిచింది. కళ్లు తెరవండి అనవసరంగా బీఆర్ఎస్ మీద నోళ్లు పారేసుకోకండి’ అని హరీష్‌రావు బీజేపీ నేతలకు హితవు పలికారు. తాము తెలంగాణకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తే, రేవంత్‌రెడ్డి ఏపీకి నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేసిండని విమర్శించారు. నీటిని కేసీఆర్ ఒడిసి పడితే.. రేవంత్‌రెడ్డి విడిచిపెట్టిండని మండిపడ్డారు.
సోయిలేని రేవంత్ రెడ్డి నల్లమలసాగర్‌కు జెండా ఊపుతున్నడని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఢిల్లీ మీటింగ్‌ను బాయ్‌కాట్ చేయాలని డిమాండ్ చేశారు. పాలకులకు ఢిల్లీకి, దావోస్‌కు తిరగడమే తప్ప పాలన మీద దృష్టి లేదని విమర్శించారు. బీఆర్ఎస్ సేద్యంపై దృష్టిసారిస్తే, రేవంత్ చోద్యం చూస్తున్నడని ఆరోపించారు.